Stock Market Close | గత రెండువారాలుగా అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్న దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలకు తోడు.. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియాల్టీ, బ్యాంకింగ్ స్టాక్స్ కొనుగోళ్ల మద్దతుతో మార్కెట్లు లాభాలబాట పట్టాయి. 30 షేర్ల సెన్సెక్స్ 591.69 పాయింట్లు పెరిగి.. 81,973.05 వద్ద ముగిసింది. మరోవైపు ఎన్ఎస్ఈ నిఫ్టీ 163.70 పాయింట్లు బలపడి 25,127.95కి పెరిగింది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,576.93 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది.
ఇంట్రాడేలో 81,541.20 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. అత్యధికంగా 82,072.17 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 591.69 పాయింట్ల లాభంతో 81,973.05 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 163.70 పాయింట్లు పెరిగి.. 25,127.95 వద్ద ముగిసింది. నిఫ్టీ 50 షేర్లలో విప్రో, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ లైఫ్ ఇన్సూరెన్స్, ఎల్అండ్టీ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లాభపడ్డాయి. ఓఎన్జీసీ, మారుతీ సుజుకీ, టాటా స్టీల్, బజాజ్ ఫైనాన్స్, అల్ట్రాటెక్ సిమెంట్ పతనమయ్యాయి. మీడియా ఇండెక్స్ అత్యధికంగా 1.31 శాతం పతనం కాగా.. రియల్టీ, ఐటీ, బ్యాంకింగ్ వంటి రంగాలు లాభాలబాటలో పయనించాయి. విస్తృత మార్కెట్లో నిఫ్టీ మిడ్‌క్యాప్-100 స్వల్పంగా పెరిగింది. నిఫ్టీ స్మాల్‌క్యాప్ 0.24 శాతం పెరిగింది.