Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లో రికార్డు లాభాలు కొనసాగుతున్నాయి. నిన్న భారీ లాభాలను ఆర్జించిన సూచీలు మంగళవారం సైతం అదే జోరును కొనసాగించాయి. సెన్సెక్స్ 341.02 పాయింట్ల లాభంతో తొలిసారిగా 69,269.14 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది. మరో వైపు నిఫ్టీ 168.30 పాయింట్ల లాభంతో 20,855.10 పాయింట్ల వద్ద రికార్డు స్థాయిలో ముగిసింది. స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాప్ రూ.2.4లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ మంగళవారం ఉదయం ట్రేడింగ్‌లో 2.4లక్షల కోట్లు పెరిగి రూ.345.88లక్షల కోట్లకు చేరగా.. సోమవారం నాటికి రూ.343.48లక్షల కోట్లుగా ఉండేది.
సెన్సెక్స్‌లో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ షేర్లు వరుసగా 4.40 శాతం, 4.37 శాతం లాభపడ్డాయి. బీపీసీఎల్, యాక్సిస్ బ్యాంక్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఎస్బీఐ మంచి లాభాలను నమోదు చేశాయి. బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్లోని 30 షేర్లలో 20 షేర్లు లాభాలను నమోదు చేశాయి. నిఫ్టీలోని 50 స్టాక్స్‌లో 37 స్టాక్స్ లాభాలను ఆర్జించాయి. వరుస ఆరు ట్రేడింగ్ సెషన్లలో మదుపరుల సంపద రూ.17.16లక్షల కోట్లు పెరిగింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.54శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.50శాతం పెరిగాయని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. బీఎస్ఈలో లిస్ట్ అయిన అన్ని కంపెనీల మార్కెట్ విలువ నవంబర్ 29న తొలిసారిగా నాలుగు ట్రియల్ డాలర్లకు పెరిగింది.
ఈ సందర్భంగా మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ సిద్ధార్థ్ ఖేమ్కా మాట్లాడుతూ.. ఎన్నికల ఫలితాల అనంతరం స్టాక్ మార్కెట్లు పుంజుకున్నాయన్నారు. 400 పాయింట్లకుపైగా పెరిగి సూచీలు కొత్త గణంకాలను నమోదు చేశాయన్నారు. ఎన్నికల ఫలితాలు, బలమైన స్థూల ఆర్థిక గణాంకాలు, వడ్డీ రేటు తగ్గింపు అంచనాల మధ్య మార్కెట్లో సానుకూల పవనాలు వీస్తున్నాయని తెలిపారు. అక్టోబర్ 23న నిఫ్టీ 18,837 పాయింట్ల వద్ద ఉండగా.. ప్రస్తుతం 1,865 పాయింట్లు పెరిగింది. ప్రీ పోల్ ర్యాలీ బలమైన స్థితిలో ఉందని.. ఈ క్రమంలో మార్కెట్ సెంటిమెంట్ మరింత బలుపడుతుందని భావిస్తున్నట్లు ఖేమ్కా పేర్కొన్నారు.
ఇదిలా ఉండగా.. నిఫ్టీలో అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, ఎన్టీపీసీ, ఎస్బీఐ టాప్ గెయినర్లు నిలిచాయి. ఎల్‌టీఐఎండ్‌ట్రీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, దివిస్ ల్యాబ్స్, హెచ్‌యూఎల్, బజాజ్ ఆటో నష్టపోయాయి. పవర్ ఇండెక్స్ 6 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ ఇండెక్స్ దాదాపు 2శాతం, బ్యాంక్ ఇండెక్స్ ఒకశాతం చొప్పున పెరిగాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రియాల్టీ సూచీలు ఒక్కొక్కటి 0.5 శాతం తగ్గాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి.