Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాల్లో ముగిశాయి. దాదాపు ఐదు రోజుల అనంతరం మార్కెట్లు లాభాల బాట పట్టాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో పాటు అమెరికా ద్రవ్యోల్బణం తగ్గాయన్న నివేదికలు దేశీయ మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే 78,488.64 పాయింట్ల వద్ద లాభాల్లో సెన్సెక్స్ మొదలైంది. ఇంట్రాడేలో 78,189.19 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యధికంగా 78,918.12 పాయింట్లకు చేరింది. చివరకు 498.58 పాయింట్లు పెరిగి.. 78,540.17 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 165.95 పాయింట్లు పెరిగి.. 23,753.45 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో దాదాపు 1,565 షేర్లు పురోగమించగా.. 2,348 షేర్లు పతనమయ్యాయి.
నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన వాటిలో జేఎస్‌డబ్ల్యూ స్టీల్, ఐటీసీ, హిందాల్కో ఇండస్ట్రీస్, ఇండస్ఇండ్ బ్యాంక్, ట్రెంట్ ఉన్నాయి. ఇక హీరో మోటోకార్ప్స్, మారుతీ సుజుకీ, నెస్లే ఇండియా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, బజాజ్ ఫిన్సర్వ్ నష్టపోయాయి. సెక్టార్లలో బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, మెటల్, ఆయిల్, గ్యాస్, ఎనర్జీ, రియల్టీ 0.5శాతం నుంచి ఒకశాతం వరకు పెరిగాయి. మీడియా ఇండెక్స్ 0.4 శాతం పతనమైంది. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ స్వల్పంగా పెరగ్గా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం పతనమైంది.