Sensex Closing Bell | దేశీయ బెంచ్ మార్క్ సూచీలు మంగళవారం తీవ్ర ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాల నేపథ్యంలో ఇవాళ ఉదయం సూచీలు లాభాల్లో మొదలయ్యాయి. మార్కెట్లో సూచీలు లాభాల్లోనే కొనసాగుతూ రాగా.. చివరి సెషల్లో మదుపరులు లాభాల స్వీకరణకు మొగ్గుచూపారు. ఆ తర్వాత అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో ట్రేడింగ్ ప్రారంభంలో, ఇంట్రాడేలో వచ్చిన లాభాలను కోల్పోయాయి. ఉదయం 71,770.91 పాయింట్ల వద్ద సెన్సెక్స్ ప్రారంభమైంది. ఒక దశలో 72వేల మార్క్‌ను దాటింది.
సెన్సెక్స్ మరోసారి గరిష్ఠానికి చేరిన నేపథ్యంలో మదుపరులు లాభాల స్వీకరణకు దిగారు. భారీగా అమ్మకాల నేపథ్యంలో 71,307 పాయింట్ల కనిష్ఠానికి చేరింది. చివరకు 30.99 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 71,386.21 పాయింట్ల వద్ద స్థిరపడింది. నిఫ్టీ 31.85 పాయింట్ల లాభంతో 21,544.85 వద్ద ముగిసింది. నిఫ్టీలో హీరో మోటోకార్ప్, అదానీ పోర్ట్స్, అపోలో హాస్పిటల్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, అదానీ ఎంటర్ప్రైజెస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. బ్రిటానియా, నెస్లే, ఏషియన్ పేయింట్స్, బజాజ్ ఫిన్సర్వ్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లూజర్స్‌గా నిలిచాయి.