Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. ఎంహెచ్పీవీ వైరస్ నేపథ్యంలో నిన్న భారీ నష్టపోయిన సూచీలు మంగళవారం కోలుకున్నాయి. వైరస్‌తో ఎలాంటి ఆందోళనలు పడాల్సిన అవసరం లేదని వైద్య నిపుణులు సూచించిన వేళ.. మార్కెట్లు కాస్త కోలుకున్నాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే.. సెన్సెక్స్ 78,019.80 పాయింట్ల వద్ద ప్రారంభమైంది. ప్రారంభంలోనే 422 పాయింట్లకుపైగా పెరిగింది. ఆ తర్వాత చివరి వరకు మార్కెట్లు లాభాల్లో ట్రేడయ్యాయి. ఇంట్రాడేలో 77,925.09 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 78,452.74 పాయింట్ల గరిష్ఠానికి చేరుకుంది. చివరకు 234.12 పాయింట్ల లాభంతో 78,199.11 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 91.85 పెరిగి.. 23,707.90 వద్ద ముగిసింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,527 షేర్లు పెరగ్గా.. మరో 1,286 షేర్లు తగ్గుముఖం పట్టాయి. నిఫ్టీలో ఓఎన్జీసీ, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, టాటా మోటార్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ టాప్ గెయినర్స్‌గా నిలిచాయి. హెచ్‌సీఎల్ టెక్, టీసీఎస్, ఐషర్ మోటార్స్, హీరో మోటోకార్ప్, ట్రెంట్ నష్టపోయాయి. సెక్టార్లలో ఐటి మినహా, ఆయిల్, గ్యాస్, రియాల్టీ, ఎనర్జీ, బ్యాంక్, మెటల్, ఫార్మా సూచీలు 0.5 నుంచి ఒకశాతం వరకు లాభపడ్డాయి. బీఎస్ఈ మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం, బీఎస్ఈ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.7 శాతం వరకు పెరిగాయి.