Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల బాట పట్టాయి. గురువారం వరుసగా ఐదో సెషన్లో సూచీలు లాభాల్లో ముగిశాయి. త్వరలో ఆర్బీఐ ఎంపీసీ సమావేశం జరుగనున్న విషయం తెలిసిందే. వడ్డీ రేట్లపై కోత విధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఈ క్రమంలో మార్కెట్లలో ఉత్సాహం నింపినట్లయ్యింది. దానికి తోడు ప్రపంచ మార్కెట్లలోని సానుకూల పవనాలతో పాటు విదేశీ మదుపరులు కొనుగోళ్లకు దిగడంతో సూచీలు పెరిగాయి. కిత్రం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,182.74 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 80,467.37 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. గరిష్ఠంగా 82,317.74 పాయింట్ల మార్క్‌ని తాకింది.
చివరకు 809.53 పాయింట్లు పెరిగి.. 81,765.86 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 240.95 పాయింట్లు పెరిగి 24,708.40 స్థిరపడింది. దాదాపు 2,050 షేర్లు పెరగ్గా.. 1758 షేర్లు పతనమయ్యాయి. నిఫ్టీలో టీసీఎస్, ఇన్ఫోసిస్, టైటాన్ కంపెనీ, ట్రెంట్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ అత్యధికంగా లాభపడ్డాయి. ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, బజాజ్ ఆటో, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఎన్టీపీసీ, గ్రాసిమ్ ఇండస్ట్రీస్ నష్టపోయాయి. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండెక్స్ 2శాతం పెరగ్గా.. రియాల్టీ, పీఎస్‌యూ బ్యాంక్ మినహా మిగిలిన అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు స్వల్ప లాభాలతో ముగిశాయి.