Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో సెషన్లో లాభాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల పవనాలతో మార్కెట్లు లాభాల్లో కొనసాగాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్.. 77,319.50 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 76,895.51 పాయింట్ల కనిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. అత్యధికంగా 77,319.50 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 318.74 పాయింట్లు పెరిగి.. 77,042.82 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 98.60 పెరిగి.. 23,311.80 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో దాదాపు 2669 షేర్లు లాభపడ్డాయి. మరో 1,132 షేర్లు నష్టపోయాయి. నిఫ్టీలో అత్యధికంగా లాభపడిన వాటిలో హెచ్డీఎఫ్సీ లైఫ్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్, అదానీ పోర్ట్స్ ఉన్నాయి. ట్రెంట్, టాటా కన్స్యూమర్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెసీఎల్ టెక్, విప్రో నష్టపోయాయి.
బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఒకశాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 1.4 శాతం పెరిగింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్, ఐటీ, ఎఫ్ఎంసీజీ, ఫార్మా మినహా మిగతా అన్ని రంగాల సూచీలు మెటల్, మీడియా, ఆయిల్ అండ్ గ్యాస్, పీఎస్‌యూ బ్యాంక్, రియాల్టీ, ఆటో 0.5 నుంచి 2.5 శాతం పెరిగాయి.