Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టపోయాయి. చైనాలో కొత్తగా వెలుగులోకి వచ్చిన హెచ్ఎంపీవీ వైరస్‌పై మరోసారి ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. మొన్నటి వరకు చైనాకే పరిమితమైన కేసులు భారత్‌లోనూ నమోదయ్యాయి. కర్నాటక, గుజరాత్ కేసులు రికార్డయ్యాయి. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశీయ మార్కెట్లు ఒక్కసారిగా కుదేలయ్యాయి. మదుపరులు అప్రమత్తంగా వ్యవహరించడంతో మార్కెట్లు భారీగా నష్టపోయాయి. పెట్టుబడిదారులు దాదాపు రూ.12లక్షల కోట్లకుపైగా సంపదను కోల్పోయారు. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్.. సోమవారం ఉదయం 79,281.65 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. మధ్యాహ్నం సెన్సెక్స్ 1200 పాయింట్లకుపైగా పతనమైంది.
ఇంట్రాడేలో 79,532.67 పాయింట్ల గరిష్ఠాన్ని తాకిన సెన్సెక్స్.. కనిష్ఠంగా 77,781.62 పాయింట్లకు పడిపోయింది. చివరకు 1,258.12 పాయింట్లు తగ్గి.. 77,964.99 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 388.70 పాయింట్లు తగ్గి.. 23,616.05 వద్ద ముగిసింది. నిఫ్టీలో అత్యధికంగా నష్టపోయిన వాటిలో టాటా స్టీల్, ట్రెంట్, కోల్ ఇండియా, ఎన్టీపీసీ, బీపీసీఎల్ ఉన్నాయి. అయితే, అపోలో హాస్పిటల్స్, టాటా కన్స్యూమర్, టైటాన్ కంపెనీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్ 4శాతం పతనమైంది. మెటల్, రియాల్టీ, ఎనర్జీ, పీఎస్‌యూ, పవర్, ఆయిల్, గ్యాస్ ఒక్కొక్కటి 3 శాతం చొప్పున క్షీణించాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 2.4 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3 శాతం పడిపోయాయి.