Stock Market Close | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం సరికొత్త గరిష్ఠాలకు చేరుకున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ మరోసారి సరికొత్త రికార్డులను నమోదు చేశాయి. ఆటో, ఐటీ, ఆయిల్, గ్యాస్, ఎఫ్ఎంసీజీ షేర్లలో కొనుగోళ్ల లాభాలను నమోదు చేశాయి. ప్రపంచ మార్కెట్లలో ప్రతికూల పవనాలు ఉన్నా మార్కెట్లు లాభాల్లో ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఈక్విటీ మార్కెట్లు ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. మధ్యాహ్నం తర్వాత కోలుకొని లాభాల బాటలో పయనించాయి. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 81,822.56 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 81,682.78 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. 82,285.83 పాయింట్ల గరిష్ఠానికి చేరింది. చివరకు 349.05 పాయింట్ల లాభంతో 82,134.61 వద్ద ముగిసింది.
నిఫ్టీ 99.60 పాయింట్లు లాభంతో 25,151.95 పాయింట్ల వద్ద ముగిసింది. సెన్సెక్స్, నిఫ్టీ గరిష్ఠాలకు పెరగడం ఇదే తొలిసారి. ట్రేడింగ్‌లో దాదాపు 1,348 షేర్లు పురోగమించగా.. 2421 షేర్లు పతనమయ్యాయి. మరో 95 షేర్లు మారలేదు. నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బీపీసీఎల్ లాభపడ్డాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎంఅండ్ఎం, జెఎస్డబ్ల్యూ స్టీల్, కోటక్ మహీంద్రా బ్యాంక్, డాక్టర్ రెడ్డీస్ లాబొరేటరీస్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.7 శాతం పతనమయ్యాయి. సెక్టోరల్‌లో ఆటో, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం, ఐటీ, ఎఫ్ఎంసీజీ 0.5శాతం నుంచి ఒకశాతం వరకు పెరిగాయి. క్యాపిటల్ గూడ్స్, ఫార్మా మీడియా, మెటల్, పవర్ 0.3 నుంచి 0.7శాతం వరకు పడిపోయాయి.