Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్ల పతనం కొనసాగుతున్నది. వరుసగా ఐదోరోజు సోమవారం నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లో ప్రతికూల పవనాలు, ట్రంప్ హెచ్చరికతో మార్కెట్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఫిబ్రవరిలో యూఎస్ వినియోగదారుల సెంటిమెంట్ 15 నెలల కనిష్ఠానికి పడిపోయింది. డొనాల్డ్ ట్రంప్ సుంకాల ప్రణాళికలపై ఆందోళనల మధ్య ద్రవ్యోల్బణ భయాలు పెరిగాయి. ఈ ప్రభావం భారత్‌పై సైతం పడుతున్నది. గత సెషన్‌తో పోలిస్తే సోమవారం సెన్సెక్స్ 74,893.45 పాయింట్ల నష్టాల్లో మొదలయ్యాయి. మళ్లీ ఏ దశలోనూ కోలుకోలేదు. ఒక దశలో 74,387.44 పాయింట్ల కనిష్ఠానికి పతనమైన సెన్సెక్స్.. ఇంట్రాడేలో 74,907.04 పాయింట్ల గరిష్ఠాన్ని తాకింది.
చివరకు 856.66 పాయింట్ల నష్టంతో.. 74,454.41 వద్ద ముగిశాయి. నిఫ్టీ 243.40 పాయింట్లు పతనమై.. 22,552.50 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 1126 షేర్లు లాభపడ్డాయి. 2,526 షేర్లు పతనమయ్యాయి. విప్రో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, ఇన్ఫోసిస్, టీసీఎస్, టాటా స్టీల్ భారీగా నష్టపోయాయి. ఎంఅండ్ఎం, ఐషర్ మోటార్స్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హీరో మోటోకార్ప్, కోటక్ మహీంద్రా బ్యాంక్ లాభపడ్డాయి. ఆటో, ఫార్మా, ఎఫ్ఎంసీజీ మినహా, అన్ని ఇతర రంగాల సూచీలు ఐటీ, మెటల్, టెలికాం సూచీలు 2 శాతం క్షీణించాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒకశాతం వరకు తగ్గాయి.