Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు ఎనిమిది రోజుల నష్టాలకు ఎట్టకేలకు బ్రేక్ పడింది. సోమవారం సెషన్లో మార్కెట్లు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఫార్మా, మెటల్, ఫైనాన్షియల్ రంగాల్లో మద్దతుతో సూచీలు లాభపడ్డాయి. గ్లోబల్ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మధ్య సూచీలు ఉదయం బలహీనంగా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత కొద్దిసేపటికే అమ్మకాల ఒత్తిడికి గురయ్యారు. పెరుగుతూ.. పడిపోతూ.. ఒడిదొడుకులను ఎదుర్కొన్నాయి. చివరకు స్వల్ప లాభాలతో బయటపడ్డాయి. సెన్సెక్స్ క్రితం సెషన్‌తో పోలిస్తే.. సోమవారం ఉదయం 75,641.41 పాయింట్ల వద్ద నష్టాల్లో మొదలయ్యాయి. ఇంట్రాడేలో 75,294.76 పాయింట్ల కనిష్ఠానికి చేరిన సెన్సెక్స్.. అత్యధికంగా 76,041.96 పాయింట్లకు పెరిగింది. చివరకు 57.65 పాయింట్ల లాభంతో 75,996.86 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 30.25 పాయింట్లు పెరిగి.. 22,959.50 వద్ద ముగిసింది.
నిఫ్టీలో బజాజ్ ఫిన్సర్వ్, అదానీ ఎంటర్ప్రైజెస్, పవర్ గ్రిడ్ కార్ప్, ఇండస్ఇండ్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్ లాభాలను ఆర్జించాయి. ఎం అండ్ ఎం, భారతి ఎయిర్టెల్, విప్రో, టీసీఎస్, ఇన్ఫోసిస్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.5 శాతం పెరగ్గా.. స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.6శాతం పడిపోయింది. ఆటో, ఐటీ, టెలికాం, మీడియా 0.5శాతం నుంచి ఒకశాతం వరకు పతనమయ్యాయి. ఫార్మా, పీఎస్‌యూ బ్యాంక్, ఎనర్జీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్, మెటల్ సూచీలు 0.5-1 శాతం పెరిగాయి. ఎన్టీపీసీ, టాటా మోటార్స్, పవర్ గ్రిడ్, ఎస్బీఐ, హీరో మోటోకార్ప్, కోల్ ఇండియా, తాన్లా ప్లాట్‌ఫామ్స్, కిర్లోస్కర్ ఆయిల్, డేటా ప్యాటర్న్స్, కార్బోరండం, ఈఐహెచ్, రిలాక్సో ఫుట్‌వేర్, టాటా టెలిసర్వీసెస్, పీఎన్సీ ఇన్ఫ్రాటెక్, జ్యోతి ల్యాబ్స్, అనుపమ్ రసాయనన్, టిటాగర్ రైల్, థర్మాక్స్, ఎన్ఎండీసీ స్టీల్, షాపర్స్ స్టాప్, బాలాజీ అమైన్స్, గ్రాఫైట్ ఇండియా సహా 900 కంటే ఎక్కువ స్టాక్‌లు బీఎస్ఇలో 52 వారాల కనిష్ఠానికి చేరుకున్నాయి.