ముంబై, మార్చి 21: దేశీయ స్టాక్ మార్కెట్లు మళ్లీ లాభాల్లోకి వచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు బ్యాంకింగ్ షేర్లకు మదుపరుల నుంచి లభించిన మద్దతుతో సెన్సెక్స్ మళ్లీ 58 వేల మార్క్ దాటింది. 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 445.73 పాయింట్లు పెరిగి 58,074.68 పాయింట్లకు చేరుకోగా, నిఫ్టీ 119.10 పాయింట్లు అందుకొని 17,107.50 వద్ద ముగిసింది. అనూహ్యంగా గ్లోబల్ మార్కెట్లు లాభాల్లోకి రావడం దేశీయ సూచీలకు కలిసొచ్చిందని దలాల్ స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. అమెరికా ఫెడరల్ రిజర్వు సమావేశంలో వడ్డీరేట్లను పెంచే అవకాశాలు అధికంగా ఉన్నప్పటికీ మదుపరులు కొనుగోళ్లకు మొగ్గుచూపడం విశేషం.