Stock Markets | ముంబై, అక్టోబర్ 23: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడోరోజూ కూడా పతనం చెందాయి. మదుపరులు ప్రాఫిట్ బుకింగ్‌కు మొగ్గుచూపడం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను తరలించుకుపోవడంతో ఒక దశలో 80 వేల పాయింట్లకు దిగువకు పడిపోయిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ చివర్లో భారీ నష్టాలను తగ్గించుకోగలిగింది. వాహన, ఫార్మా, క్యాపిటల్ గూడ్స్ రంగాలకు చెందిన షేర్లలో క్రయవిక్రయాలు జోరుగా సాగడంతో 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 138.74 పాయింట్లు నష్టపోయి 80,081.98 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 36.60 పాయింట్లు పతనం చెంది 24,435.50 వద్దకు జారుకున్నది. 30 షేర్ల ఇండెక్స్ సూచీల్లో 22 సూచీలు నష్టపోగా, కేవలం ఎనిమిది లాభాల్లో ముగిశాయి. వీటిలో మహీంద్రా అండ్ మహీంద్రా, సన్‌ఫార్మా, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్, ఎల్అండ్టీ, ఐసీఐసీఐ బ్యాంక్, టైటాన్లు అత్యధికంగా నష్టపోయాయి. కానీ, బజాజ్ ఫైనాన్స మాత్రం 5 శాతం పెరిగి టాప్ గెయినర్‌గా నిలిచింది. దీంతోపాటు టెక్ మహీంద్రా, టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్‌సీఎల్ టెక్నాలజీ, బజాజ్ ఫిన్‌సర్వ్‌లు లాభాల్లో ముగిశాయి. రంగాలవారీగా చూస్తే పవర్ 1.39 శాతం, క్యాపిటల్ గూడ్స్ 1.17 శాతం, ఇండస్ట్రీయల్స్, వాహన, యుటిలిటీ రంగాలకు చెందిన షేర్లు భారీగా నష్టపోయాయి. కానీ, ఐటీ, టెక్, టెలికం, ఆర్థిక రంగ షేర్లు లాభాల్లో ముగిశాయి.
బంగారం ర్యాలీ కొనసాగుతున్నది. గత ఆరు రోజులుగా పెరుగుతూ వచ్చిన పుత్తడి బుధవారం కూడా మరో రికార్డు స్థాయికి చేరుకున్నాయి. పండుగ సీజన్‌కు తోడు పెళ్లిళ్ల సీజన్ కూడా కావడంతో బంగారానికి అనూహ్యంగా డిమాండ్ నెలకొన్నదని, దీంతో ధరలు మరో చారిత్రక గరిష్ఠ స్థాయికి చేరుకున్నాయని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. ఢిల్లీ బులియన్ మార్కెట్లో తులం పుత్తడి ధర రూ.500 ఎగబాకి రూ.81,500 పలికింది. గోల్డ్‌తోపాటు వెండి ఏకంగా రూ.1,000 పెరిగి రూ.1.02 లక్షలకు చేరుకున్నది. గత ఆరు రోజుల్లో కిలో వెండి రూ.10 వేలు, తులం పుత్తడి ధర రూ.2,850 పెరిగింది.