2021-22లో 59.75 లక్షల కోట్లు పెరిగిన బీఎస్ఈ మదుపరుల సంపద
న్యూఢిల్లీ, మార్చి 31: దేశీయ స్టాక్ మార్కెట్లు పరుగులు పెట్టడంతో గురువారంతో ముగిసిన 2021-22 (ఏప్రిల్-మార్చి) ఆర్థిక సంవత్సరంలో మదుపరుల సంపద భారీగా పెరిగింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ గడిచిన ఏడాది కాలంలో 18 శాతం ఎగబాకింది. దీంతో బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఈ ఒక్క ఏడాదే రూ.59,75,686.84 కోట్లు పెరిగి రూ.2,64,06,501.38 కోట్లను తాకింది. ద్రవ్యోల్బణం, విదేశీ మదుపరుల పెట్టుబడుల ఉపసంహరణలు, అంతర్జాతీయంగా ఆందోళనకర పరిస్థితులున్నా.. భారతీయ మార్కెట్లు వృద్ధిబాటలో పయనించాయి. మొత్తం 2021-22లో సెన్సెక్స్ 9,059.36 పాయింట్లు లేదా 18.29 శాతం ఎగిసింది. ఈ ఏడాది జనవరి 17న బీఎస్ఈ సంస్థల మార్కెట్ విలువ మునుపెన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో రూ.280 లక్షల కోట్లను దాటేసింది. ఇక నిరుడు అక్టోబర్ 19న బీఎస్ఈ సెన్సెక్స్ 62,245.43 పాయింట్ల ఆల్‌టైమ్ హైని చేరింది.
రిలయన్స్ టాప్
ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) మార్కెట్ విలువ బీఎస్ఈలో అత్యధికంగా రూ.17,81,834.57 కోట్లుగా ఉన్నది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా టీసీఎస్ (రూ.13,83,001.33 కోట్లు), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (రూ.8,15,166.80 కోట్లు), ఇన్ఫోసిస్ (రూ.8,02,309.19 కోట్లు), ఐసీఐసీఐ బ్యాంక్ (రూ.5,07,434.03 కోట్లు) ఉన్నాయి. 2020-21 ఆర్థిక సంవత్సరంలో బీఎస్ఈ బెంచ్‌మార్క్ 68 శాతం ఎగిసిన విషయం తెలిసిందే.
నష్టాలతోనే వీడ్కోలు
దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాల్లో ముగిశాయి. దీంతో 2021-22 ఆర్థిక సంవత్సరానికి నష్టాలతో వీడ్కోలు పలికినైట్టెంది. సెన్సెక్స్ 115.48 పాయింట్లు లేదా 0.20 శాతం కోల్పోయి 58,568.51 వద్ద ముగిసింది. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ సూచీ నిఫ్టీ 33.50 పాయింట్లు లేదా 0.19 శాతం పడిపోయి 17,464.75 వద్ద నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ షేర్లలో ప్రధానంగా లాభాల స్వీకరణ జరిగింది. కాగా, 2021-22లో నిఫ్టీ 2,774.05 పాయింట్లు లేదా 18.88 శాతం ఎగబాకింది. అంతర్జాతీయంగా మెజారిటీ ఆసియా, ఐరోపా మార్కెట్లూ నష్టాల్లోనే కదలాడుతున్నాయి.
రూపాయికి దెబ్బ
డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ 2021-22లో 3.61 శాతం లేదా రూ.2.64 పైసలు నష్టపోయింది. కొనుగోలుదారుల నుంచి డాలర్‌కు పెరిగిన మద్దతు, ఎగబాకుతున్న ముడి చమురు ధరలే కారణమని ఫారెక్స్ మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇదిలావుంటే గురువారం రూపాయి మారకం విలువ 16 పైసలు పెరిగి 75.74 వద్ద స్థిరపడింది.