Stock Markets | ముంబై, అక్టోబర్ 8: దేశీయ స్టాక్ మార్కెట్ల వరుస నష్టాలకు బ్రేక్‌పడింది. వరుసగా ఆరు రోజులుగా భారీగా నష్టపోయిన సూచీలు తిరిగి కోలుకున్నాయి. బ్లూచిప్ సంస్థల షేర్లకు లభించిన మద్దతుకు తోడు అంతర్జాతీయ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలు సూచీలను ముందువైపుకు నడిపించాయి. ఇంట్రాడేలో 700 పాయింట్లకు పైగా పెరిగిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు 585 పాయింట్లు అందుకొని 81,635 పాయింట్ల వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ సైతం 217.40 పాయింట్లు ఎగబాకి తిరిగి 25 వేల మార్క్‌ను అధిగమించింది. చివరకు 25,013.15 పాయింట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్లు ఉవ్వెత్తున ఎగిసిపడటంతో మదుపరుల సంపద భారీ స్థాయిలో పెరిగింది.
గత ఆరు సెషన్లలో రూ.9 లక్షల కోట్లకు పైగా సంపదను కోల్పోయిన మదుపరులు ఒక మంగళవారం నాడే రూ.7 లక్షల కోట్లకు పైగా పెరగడం విశేషం. దీంతో బీఎస్ఈలో లిైస్టెన కంపెనీల మార్కెట్ విలువ రూ.7,51,481.51 కోట్లు పెరిగి రూ.4,59,50,926.21 కోట్లు(5.47 ట్రిలియన్ డాలర్లు)కు చేరుకున్నది. ఆసియా, యూరప్ మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు ఆర్బీఐ తన పరపతి సమీక్షలో తీసుకునే నిర్ణయం కోసం మదుపరులు వేచి చూస్తుండటం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు నిధులను తరలించుకుపోయినప్పటికీ సూచీలు లాభాల్లో ముగిశాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి.