SCSS | రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రతను కల్పించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం తెచ్చినదే సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీం (ఎస్సీఎస్ఎస్). దీని వడ్డీరేటును 3 నెలలకోసారి కేంద్రం సమీక్షించి ఓ నిర్ణయం తీసుకుంటుంది.
60 ఏండ్లు, ఆపై వయసు కలిగినవారు ఎస్సీఎస్ఎస్లో పెట్టుబడి పెట్టవచ్చు. అలాగే స్వచ్చంధంగా లేదా స్పెషల్ వాలంటరీ స్కీంలో భాగంగా రిటైరైన 55 ఏండ్లకుపైబడినవారూ అర్హులే. సివిల్ డిఫెన్స్ సిబ్బంది మినహా రక్షణ సర్వీసుల నుంచి రిటైరైన ఉద్యోగులకూ ఈ పథకం వర్తిస్తుంది.
ఈ జూలై-సెప్టెంబర్ త్రైమాసికానికిగాను డిపాజిట్లు చేసేవారికి 8.2 శాతం వడ్డీరేటు వస్తుంది. ప్రతీ మూడు నెలలకోసారి వడ్డీ చెల్లింపులుంటాయి. ఏటా మార్చి 31, జూన్ 30, సెప్టెంబర్ 30, డిసెంబర్ 31 తేదీల్లో త్రైమాసికపు సెటిల్మెంట్లుంటాయి.
కనిష్ఠంగా 1,000, గరిష్ఠంగా రూ.30 లక్షలదాకా డిపాజిట్ చేసుకోవచ్చు. ఖాతాలో ఒకవేళ పరిమితికి మించి నగదు డిపాజిట్లు జరిగితే.. ఆ మొత్తాలను ఖాతాదారుకు వెంటనే రిఫండ్ చేయడం జరుగుతుంది. ఆలస్యమైతే డిపాజిట్ చేసిన దగ్గర్నుంచి రిఫండ్ ఇచ్చేదాకా పట్టిన సమయానికిగాను సదరు మొత్తాలకు పోస్టాఫీస్ సేవింగ్స్ అకౌంట్ వడ్డీరేటును లెక్కించి ఇస్తారు.
డిపాజిట్ కాలపరిమితి ఐదేండ్లు. ఆపై మరో మూడేండ్లు పొడిగించుకోవచ్చు. ఇలా ఎన్నేైండ్లెనా పెంచుకుంటూపోవచ్చు. ప్రతీ పొడిగింపునకు ఓ దరఖాస్తును సమర్పించాలి. కాలపరిమితి ముగింపు దశలోనే ఇవ్వాలి.
ఆదాయ పన్ను (ఐటీ) చట్టం 1961లోని సెక్షన్ 80సీ కింద పన్ను ప్రయోజనాలు అందుతాయి. ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేలకు మించి వడ్డీ ఆదాయం వచ్చినప్పుడే పన్నులు వర్తిస్తాయి. నిబంధనలకు లోబడి ఫామ్ 15జీ/15హెచ్ సమర్పిస్తే టీడీఎస్ ఉండదు.
కొత్త మార్గదర్శకాల ప్రకారం ఏడాదిలోగా ఎస్సీఎస్ఎస్ డిపాజిట్ ఖాతాను మూసేస్తే.. సదరు డిపాజిట్లో 1 శాతానికి సమానమైన మొత్తాలను ఇన్వెస్టర్లు కోల్పోవాల్సి వస్తుంది. అలాగే పూర్తి కాలపరిమితికన్నా ముందే చేసే ఉపసంహరణలపైనా పెనాల్టీలు వర్తిస్తాయని గుర్తుంచుకోవాలి.