Section 80D | ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్నది. వేతన జీవులు, చిన్న వ్యాపారులు, హిందూ అవిభాజ్య కుటుంబాలు (హెచ్‌యూఎఫ్), కార్పొరేట్ సంస్థలు ప్రతి ఒక్కరూ తమ వార్షిక ఐటీ రిటర్న్స్ సమర్పించాల్సిందే. వేతన జీవులకు పాత ఐటీ పాలసీ విధానం కింద ఆదాయం పన్ను చట్టం-1961లోని 80సీ సెక్షన్ కింద రూ.1.50 లక్షల వరకు పన్ను మినహాయింపు క్లయిమ్ చేసుకోవచ్చు. ఒకవేళ 80సీ సెక్షన్ కింద లిమిట్ దాటేశాం అనుకుంటే మరింత పన్ను ఆదా చేయడానికి సెక్షన్ 80డీ అందుబాటులో ఉంది.
80డీ సెక్షన్ కింద మెడికల్ ఇనసూరెన్స్ ప్రీమియం చెల్లింపులను పన్ను ఆదా కోసం క్లయిమ్ చేయొచ్చు. కానీ, కొత్త ఐటీ పన్ను విధానం కింద ఈ డిడక్షన్ వర్తించదు సుమా. ఒకవేళ మీరు పాత పన్ను విధానం కింద ఐటీ రిటర్న్స్ క్లయిమ్ చేయదలిచినప్పుడు మాత్రమే ఆదాయం పన్ను చట్టం-1961లోని 80డీ సెక్షన్ కింద మినహాయింపు వర్తిస్తుంది. దీని కింద ఎంత వరకు పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చనే సంగతి చూద్దాం..!
ఒక ఆర్థిక సంవత్సరంలో హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ప్రీమియం చెల్లింపునకు ‘80డీ’ సెక్షన్ వర్తిస్తుంది. ప్రతి ఒక వ్యక్తి, తనతోపాటు తన జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలకు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ వర్తిస్తుంది. ఒకవేళ తమ తల్లిదండ్రులకు హెల్త్ ఇన్సూరెన్స్ పే చేసే వారు ఉంటే అదనంగా డిడక్షన్ క్లయిమ్ చేయొచ్చు. ఆయా తల్లిదండ్రుల వయస్సును బట్టి, కుటుంబ యజమాని వయస్సును బట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కింద పన్ను ఆదా చేయడానికి ఎంత వరకు క్లయిమ్ చేయొచ్చు అనేది నిర్ధారించుకోవచ్చు.
పన్ను చెల్లింపు దారు 60 ఏండ్ల లోపు వయస్సు గల వారైతే తాను, తనతోపాటు జీవిత భాగస్వామి, ఇద్దరు పిల్లలకు రూ.25 వేల వరకు ప్రీమియం పేమెంట్ క్లయిమ్ చేయొచ్చు. సదరు పన్ను చెల్లింపుదారుడి తల్లిదండ్రులు కూడా 60 ఏండ్లలోపు వారైతే అదనంగా రూ.25 వేల వరకు క్లయిమ్ చేయొచ్చు. వేతన జీవి తన కుటుంబానికి, తల్లిదండ్రులకు కలిపి రూ.50 వేల వరకు పన్ను ఆదా క్లయిమ్ చేయవచ్చు.
వేతన జీవి తల్లిదండ్రులు 60 ఏండ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు గల వారైతే పన్ను డిడక్షన్ మొత్తం ఎక్కువ ఉంటుంది. రూ.25 వేలకు బదులు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపుపై పన్ను ఆదా చేయొచ్చు.
ప్రతి వేతన జీవి వార్షిక ఆదాయాన్ని బట్టి, దానికి వర్తించే పన్నుశ్లాబ్ ఆధారంగా ‘సెక్షన్ 80డీ’ కింద పన్ను ఆదా చేయొచ్చు. ఒకవేళ ఒకరి ఆదాయం రూ.2.5-5 లక్షల మధ్య ఉంటే, పన్ను శ్లాబ్ ఐదు శాతం ఉంటుంది. దీని ప్రకారం సెస్‌తో కలుపుకుని రూ.1300 పన్ను ఆదా అవుతుంది. వేతన జీవి ఆదాయం రూ.5-10 లక్షల మధ్య ఉంటే సెస్‌తో కలుపుకుని రూ.5200 పొదుపు చేయొచ్చు. గరిష్టంగా 30 శాతం పన్ను చెల్లించే వారైతే సెస్‌తో కలుపుకుని రూ.7,800 పన్ను ఆదా చేయగలుగుతారు.
ప్రివెంటివ్ హెల్త్ చెకప్‌కు కూడా 80డీ సెక్షన్ కింద రూ.5000 వరకు పన్ను మినహాయింపు క్లయిమ్ చేయొచ్చు. గరిష్టంగా రూ.25 వేల నుంచి రూ.50 వేల వరకు ఉంటుంది. ఉదాహరణకు 60 ఏండ్లలోపు వ్యక్తి కోసం రూ.21 వేల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే, మరో రూ.4000 ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కింద క్లయిమ్ చేయవచ్చు. ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కింద పలు డయాగ్నిస్టిక్స్ ల్యాబ్స్, హాస్పిటల్స్ వైద్య పరీక్షలను క్లయిమ్ చేయవచ్చు.
సీనియర్ సిటిజన్ లేదా సీనియర్ సిటిజన్ తండ్రికి ఏ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కవరేజీ లేకపోతే 80డీ సెక్షన్ కింద క్లయిమ్ చేయొచ్చు. మెడికల్ బిల్లుల ఆధారంగా సీనియర్ సిటిజన్లు, సీనియర్ సిటిజన్ తల్లిదండ్రుల వైద్య ఖర్చులను డిడక్షన్ కోసం క్లయిమ్ చేసుకోవడానికి అనుమతి ఇస్తూ 2018-19 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పన్ను చట్టానికి సవరణలు చేశారు.
సెక్షన్ 80డీ కింద హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులు ఎలక్ట్రానిక్ లేదా డిజిటల్ మోడ్‌లో గానీ చెల్లించాల్సి ఉంటుంది. చెక్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు, యూపీఐ పేమెంట్ ద్వారా పే చేయాలి. క్యాష్ రూపంలో హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లిస్తే 80డీ సెక్షన్ కింద పన్ను డిడక్షన్ క్లయిమ్ చేయలేరు. నగదు రూపంలో హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లించినా ప్రివెంటివ్ హెల్త్ చెకప్ కింద క్లయిమ్ చేయడానికి మాత్రమే అనుమతి ఇస్తున్నది ఆదాయం పన్నుశాఖ.
వేతన జీవులు, తల్లిదండ్రులు 60 ఏండ్ల లోపు వారైతే రూ.50 వేలు
వేతన జీవి 60 ఏండ్ల లోపు, తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లయితే రూ.75 వేలు
పన్ను చెల్లింపుదారు, తల్లిదండ్రులు సీనియర్ సిటిజన్లయితే రూ. లక్ష
ఆదాయం ———- గరిష్ట డిడక్షన్ ——– గరిష్ట డిడక్షన్ —– గరిష్ట డిడక్షన్ —— గరిష్ట డిడక్షన్
పన్ను రేటు ———- రూ.25,000 ——— రూ.50,000 ——– రూ.75,000 ——– రూ.1,00,000
———————————————————————————————————-
5% ——————- రూ.1300 ———— రూ.2,600 ——— రూ.3,900 ———- రూ.5,200
20% —————— రూ.5200 ———– రూ.10,400 ——— రూ.15,600 —— రూ.20,800
30% —————- రూ.7800 ————- రూ.15,600 ——— రూ.23,400 —— రూ. 31,200