న్యూఢిల్లీ, డిసెంబర్ 5: అనామక ఆన్లైన్ వేదికల ద్వారా లభించే అన్‌లిస్టెడ్ డెట్ సెక్యూరిటీస్తో జాగ్రత్తగా ఉండాలని, వాటికి జోలికి వెళ్లరాదని గురువారం ఇన్వెస్టర్లను మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ హెచ్చరించింది. ఈ అన్‌రిజిస్టర్డ్ ఆన్లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై ఎటువంటి నియంత్రణా ఉండదని, మదుపరుల రక్షణ వ్యవస్థ కూడా లేదని ఓ ప్రకటనలో సెబీ పేర్కొన్నది. కంపెనీల చట్టం 2013ను ఉల్లంఘిస్తూ 200లకుపైగా ఇన్వెస్టర్లకు అన్‌లిస్టెడ్ సెక్యూరిటీస్‌ను అక్రమ సంస్థలు ఆఫర్ చేస్తున్నాయని సెబీ గుర్తించింది.
ఈ క్రమంలోనే పైవిధంగా మదుపరులను అప్రమత్తం చేసింది. వీటిలో పెట్టుబడులు పెడితే చాలా ప్రమాదమని గుర్తుచేసింది. కాగా, లిస్టెడ్ డెట్ సెక్యూరిటీల్లో పెట్టుబడుల కోసం బీఎస్ఈ, ఎన్ఎస్ఈ ఆథరైజ్డ్ స్టాక్‌బ్రోకర్లు నిర్వహించే రిజిస్టర్డ్ ఆన్లైన్ బాండ్ ప్లాట్ఫామ్స్ల్లోకి మాత్రమే వెళ్లాలని ఈ సందర్భంగా సెబీ సూచించింది.
ఇదిలావుంటే గత 30 రోజుల్లో ఎలాంటి లావాదేవీలు జరుపని క్లయింట్స్ ఖాతాల్లోని ఫండ్స్ సెటిల్మెంట్కు సెబీ నడుం బిగించింది. 3 పనిదినాల్లో సమస్యను పరిష్కరించేలా స్టాక్ బ్రోకర్లకు సెబీ సూచిస్తున్నది. అలాగే ఈక్విటీ మార్కెట్లలో క్లోజ్ యాక్షన్ సెషన్‌ను సెబీ పరిచయం చేయాలని చూస్తున్నది. దేశంలోని ఈక్విటీ క్యాష్ మార్కెట్లో స్టాక్స్ క్లోజింగ్ ధర నిర్ధారణకే దీన్ని ప్రతిపాదిస్తున్నది. ఇక ఎక్సేంజీల రిపాజిటరీ ప్లాట్‌ఫామ్‌పై ఐపీవో డాక్యుమెంట్లను అప్లోడ్ చేయాల్సిందిగా మర్చంట్ బ్యాంకర్లను సెబీ ఆదేశించింది. మరోవైపు ఫిజికల్ సెటిల్మెంట్ తప్పనిసరిగా ఉన్న డెరివేటివ్స్ మార్కెట్లో సెటిల్మెంట్ రిస్క్‌లను పరిష్కరించేందుకు ఫ్యూచర్స్లోకి ఐటీఎం ఆప్షన్స్ డివాల్వింగ్పై ఓ కన్సల్టేషన్ పేపర్‌ను సెబీ ఇచ్చింది.