న్యూఢిల్లీ, మే 1: క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. జాయింట్ మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియో నిర్వహణదారులకు ఊరటనిచ్చింది. సంయుక్తంగా నిర్వహించే మ్యూచువల్ ఫండ్ ఖాతాల కోసం నామినేషన్ తప్పనిసరేమీ కాదని బుధవారం స్పష్టం చేసింది. సులభతర వ్యాపార విధానా (ఈవోడీబీ)ల్లో భాగంగా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నది. అలాగే కమోడిటీ, విదేశీ పెట్టుబడులను పర్యవేక్షించేందుకు ఒకే ఫండ్ మేనేజర్‌ను పెట్టుకునేలా మ్యూచువల్ ఫండ్ సంస్థలకు అనుమతినిచ్చింది. దీనివల్ల ఫండ్ నిర్వహణ వ్యయభారం తగ్గుతుందని పేర్కొన్నది. కాగా, సెబీ ఏర్పాటుచేసిన ఓ కార్యాచరణ బృందం.. మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్‌ను సమీక్షించి, మెరుగైన ఈవోడీబీ ప్రమాణాలను సిఫార్సు చేసిన నేపథ్యంలోనే తాజా నిర్ణయాలు వచ్చాయి. ప్రజాభిప్రాయం మేరకే ఈ రెండు నిర్ణయాలను తీసుకున్నట్టు సెబీ కూడా తెలియజేసింది.
‘సంయుక్తంగా నిర్వహించే మ్యూచువల్ ఫండ్ పోర్ట్‌ఫోలియోస్ కోసం నామినేషన్‌ను మ్యూచువల్ ఫండ్స్ సంస్థలు ఐచ్ఛికంగా తీసుకోవచ్చు. వీలుంటే చేసుకోవచ్చు లేదంటే మానుకోవచ్చు’ అని ఓ సర్క్యులర్‌లో సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) తెలిపింది. దీంతో ఈ సడలింపులు జాయింట్ హోల్డర్స్‌కు లాభించగలవని ఇండస్ట్రీ నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇదిలావుంటే వ్యక్తిగత మ్యూచువల్ ఫండ్ నిర్వహణదారులంతా కూడా జూన్ 30కల్లా నామినేషన్‌ను ఎంచుకోవాల్సిందేనని సెబీ తేల్చిచెప్పింది. లేకపోతే ఉపసంహరణలకు వీల్లేకుండా ఖాతాలను స్తంభింపజేస్తామని హెచ్చరించింది. కమోడిటీ మార్కెట్లో పాల్గొనే గోల్డ్ ఈటీఎఫ్‌లు, సిల్వర్ ఈటీఎఫ్‌ల వంటి కమోడిటీ ఆధారిత ఫండ్స్, ఇతర ఫండ్స్.. డెడికేటెడ్ ఫండ్ మేనేజర్‌ను నియమించుకోవడం కూడా ఐచ్ఛికమే. విదేశీ పెట్టుబడులకూ ఇది వర్తిస్తుంది.