SEBI on IPO | స్టాక్ మార్కెట్లలో వివిధ కంపెనీల ఇన్షియల్ పబ్లిక్ ఆఫర్(ఐపీఓ) లకు అనుమతిపై మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీ కీలక ప్రతిపాదన తీసుకొచ్చింది. ఐపీవో లిస్టింగ్ సమయాన్ని కుదించడంతోపాటు సబ్స్క్రిప్షన్ పూర్తయ్యాక స్టాక్ ఎక్స్చేంజ్ల్లో లిస్టింగ్ గడువు కూడా మూడు రోజులకు తగ్గించాలని ప్రతిపాదించింది. ఇంతకుముందు స్టాక్ ఎక్స్చేంజ్ల్లో లిస్టింగ్‌కు ఆరు రోజుల గడువు ఉంది. ఇలా గడువు కుదించడం వల్ల ఐపీవోకి వచ్చిన సంస్థలకు, ఐపీవోలో సబ్స్క్రిప్షన్ పొందిన మదుపర్లకు మేలు జరుగుతుందని వ్యాఖ్యానించింది.
స్టాక్ ఎక్స్చేంజీల్లో సంస్థల లిస్టింగ్ సమయం తగ్గించడం వల్ల.. ఐపీవో ద్వారా ఆయా కంపెనీలు సమీకరించిన నిధులను తమ వ్యాపార అవసరాలకు వాడుకోవడానికి వీలు కలుగుతుందని సెబీ పేర్కొంది. అలాగే ఇన్వెస్టర్లు కూడా తమ ఇన్వెస్ట్‌మెంట్‌పై స్టాక్స్, లిక్విడిటీ త్వరితగతిన పొందడానికి వీలవుతుందని సెబీ తన సంప్రదింపుల పత్రంలో వెల్లడించింది.
స్టాక్ ఎక్స్చేంజ్ల్లో ఐపీవో కంపెనీల లిస్టింగ్ గడువు ఆరు రోజుల నుంచి మూడు రోజులకు తగ్గించడంపై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించనున్నది. వచ్చేనెల మూడో తేదీ వరకు సాధారణ ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత ఐపీవో లిస్టింగ్ సమయం తగ్గింపుపై సెబీ విధి విధానాలు ఖరారు చేసే అవకాశాలు ఉన్నాయి.