న్యూఢిల్లీ, డిసెంబర్ 13: ఆల్గారిత్మిక్ ట్రేడింగ్ (ఆల్గో ట్రేడింగ్)లో రిటైల్ మదుపరులకు పాల్గొనే అవకాశం కల్పించాలని క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ యోచిస్తున్నది. మార్కెట్ ప్రభావం, పారదర్శకతను పెంచడంలో భాగంగా డైరెక్ట్ మార్కెట్ యాక్సెస్ (డీఎంఏ) సదుపాయం ద్వారా ఆల్గో ట్రేడింగ్‌ను సెబీ పరిచయం చేసింది. ఇందులో తక్కువ లావాదేవీ ఖర్చులు, ఎక్కువ పారదర్శకత, అత్యుత్తమ ఆడిటింగ్, వేగవంతమైన ఆర్డర్లుంటాయి. సంస్థాగత మదుపరులకు సైతం పరిమితంగానే ఉండే ఈ సదుపాయాన్ని.. ఇప్పుడు రిటైల్ ఇన్వెస్టర్లకు ఇవ్వాలని సెబీ భావిస్తున్నది.
మరోవైపు ప్రత్యామ్నాయ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్) కోసం ప్రో-రాటా హక్కుల్లో ఫ్లెక్సిబిలిటీని శుక్రవారం సెబీ పరిచయం చేసింది. అలాగే నమోదుకాని అంతర్జాతీయ సెక్యూరిటీస్ ఐడెంటిఫికేషన్ నెంబర్స్ లిస్టింగ్‌కు వాటి జారీదారులకు నిబంధనల సడలింపును సెబీ కల్పించింది. ఇక మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇనిస్టిట్యూషన్స్ (ఎంఐఐ)ల్లో ప్రతిపాదిత కీలక అధికారుల నియామకాల ప్రక్రియపై, క్లియరింగ్ కార్పొరేషన్స్ ఓనర్షిప్ డివర్సిఫైయింగ్ ప్రతిపాదనలపై అభిప్రాయాలను తెలియజేసేందుకున్న గడువును కూడా ఈ నెలాఖరుదాకా సెబీ పొడిగించింది.