న్యూఢిల్లీ/ముంబై, జూలై 5: భారతీయ మార్కెట్లలో అమెరికాకు చెందిన ప్రొప్రైటరీ ట్రేడింగ్ సంస్థ జేన్ స్ట్రీట్ గ్రూప్ పాల్పడిన అక్రమాలు సంచలనం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ.. జేన్ స్ట్రీట్‌పై నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఎస్క్రో ఖాతాలో అక్రమంగా ఆర్జించిన రూ.4,843 కోట్ల లాభాలను డిపాజిట్ చేయాలని కూడా ఆ కంపెనీని సెబీ ఆదేశించిన సంగతీ విదితమే. అయితే ఓ సంస్థకు ఈ స్థాయిలో జరిమానా పడటం సెబీ చరిత్రలోనే ఇది తొలిసారి. ఇక సెబీ బయటపెడుతున్న వివరాల్లో జేన్ స్ట్రీట్ ఎలా వేల కోట్ల రూపాయలను ఆర్జించిందో తెలియవస్తుంటే.. మన వ్యవస్థలో సరిదిద్దాల్సిన లోపాలు ఎన్నున్నాయో అర్థమవుతున్నదిప్పుడు. గత ఏడాది జనవరిలో ఓ రోజైతే ఏకంగా రూ.735 కోట్ల లాభాన్ని జేన్ స్ట్రీట్ జేబులో వేసుకున్నది మరి.
ఇదీ సంగతి..
2024 జనవరి 17న జేన్ స్ట్రీట్.. బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్, దాని కంపోనెంట్స్‌లో మునుపెన్నడూ లేనివిధంగా ఓ సరికొత్త ‘ఇంట్రా-డే ఇండెక్స్ మ్యానిపులేషన్’ స్కీంను తెచ్చి ఇండెక్స్ ఆప్షన్స్ నుంచి పెద్ద ఎత్తున లాభాలను గడించిందని సెబీ దర్యాప్తులో తేలింది. నాడు బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్ 46,573.95 వద్ద ముగిసింది. మునుపటి రోజు (జనవరి 16) ముగింపు (48,125.10)తో పోల్చితే నష్టాలను చవిచూసింది. అయితే ఇందుకు కారణం అంతా 16న మార్కెట్ ట్రేడింగ్ ముగిసిన తర్వాత హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ప్రకటించిన ఆర్థిక ఫలితాలు నిరాశపర్చడమే అనుకున్నారు. కానీ దీని వెనుక జేన్ స్ట్రీట్ అనుసరించిన రెండు దశల వ్యూహాలున్నాయని, అందువల్లే 17న కొద్ది గంటల ట్రేడింగ్‌లోనే అది రూ.734.93 కోట్ల నికర లాభాలను పొందినట్టు సెబీ గుర్తించింది. నాడు ఉదయాన్నే క్యాష్/ఫ్యూచర్స్ మార్కెట్లలో బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్‌లోని రూ.4,370 కోట్ల విలువైన స్టాక్స్‌ను జేన్ స్ట్రీట్ కొన్నది. ఈ పరిణామం సూచీలో కృత్రిమ పెరుగుదలకు దారితీసింది. దీంతో అప్పటిదాకా నష్టాల్లో కదలాడుతున్న మార్కెట్.. రికవరీ అవుతున్నదన్న తప్పుడు సంకేతాలు మదుపరులలోకి వెళ్లాయి.
ఇదే సమయంలో చౌకగా కొనుగోలు ఆప్షన్స్‌ను, ఖరీదైనవిగా అమ్మకపు ఆప్షన్లను పెట్టడం ద్వారా బడా బ్యాంకుల షేర్లుండే నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఆప్షన్స్‌లో రూ.32,114.96 కోట్ల బేరిష్ పొజీషన్లను జేన్ స్ట్రీట్ ప్రభావవంతంగా నిర్మించగలిగింది. అయితే ఆ తర్వాత కాసేపటికే తమవద్ద ఉన్న దాదాపు అన్ని స్టాక్స్‌ను జేన్ స్ట్రీట్ అమ్మేసింది. దీంతో పెద్ద ఎత్తున జరిగిన అమ్మకాలు.. కంపోనెంట్ స్టాక్స్, ఇండెక్స్‌లో ధరల పతనానికి దారితీసింది. సూచీ పడిపోయింది. ఈ సమయంలో జేన్ స్ట్రీట్ గ్రూప్ సైతం ఇంట్రా-డే క్యాష్/ఫ్యూచర్స్ మార్కెట్ ట్రేడింగ్‌లో నష్టాలను అందుకున్నది. అయినప్పటికీ ఇండెక్స్ ఆప్షన్స్ నుంచి వచ్చిన లాభాలు ఈ నష్టాల కంటే చాలాచాలా ఎక్కువని సెబీ చెప్తున్నది. ఇలా 2023 జనవరి నుంచి 2025 మే వరకు దేశంలోని వివిధ మార్కెట్ సెగ్మెంట్లలో మొత్తం రూ.36,671 కోట్ల నికర లాభాలను జేన్ స్ట్రీట్ అందుకోవడం గమనార్హం.
ఐఐటీ విద్యార్థికి రూ.4.3 కోట్ల జీతం
భారతీయ డెరివేటివ్స్ మార్కెట్లో అధునాతన అల్గారిథమిక్ ట్రేడింగ్ ద్వారా పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడిన జేన్ స్ట్రీట్ సంస్థ.. ఓ ఐఐటీ మద్రాస్ విద్యార్థికి ఏకంగా రూ.4.3 కోట్ల వార్షిక వేతనాన్ని ఆఫర్ చేయడం ఇప్పుడు మిక్కిలి ప్రాధాన్యతను సంతరించుకుంటున్నది. గత ఏడాది డిసెంబర్లో జరిగిన ఐఐటీ మద్రాస్ ప్లేస్మెంట్ సీజన్లోనే ఇది అత్యధికం కావడం గమనార్హం. అయితే మ్యాథమెటిక్స్, ప్రోగ్రామింగ్, రియల్-టైం డెసిషన్-మేకింగ్‌లో అడ్వాన్స్డ్ నైపుణ్యాలున్నవారికి ఆ కంపెనీ ఎందుకింత పెద్దపీట వేస్తున్నదనడానికి కూడా ఈ ఆఫర్ అద్దం పడుతున్నదిప్పుడు. ఎంఐటీ, హార్వర్డ్, కేంబ్రిడ్జ్, ఆక్స్ఫర్డ్, స్టాన్‌ఫర్డ్, ప్రిన్స్టన్ వంటి అంతర్జాతీయ ప్రముఖ యూనివర్సిటీల నుంచి ఎక్కువగా జేన్ స్ట్రీట్ నియామకాలు చేపడుతున్నది. భారత్‌లోనైతే ఐఐటీల నుంచి ఉద్యోగులను తీసుకుంటున్నది. ఇక సాధారణంగా జేన్ స్ట్రీట్ ఇంటర్వ్యూ ప్రక్రియ క్వాంటిటేటివ్ సమస్యల పరిష్కారం, కోడింగ్ సవాళ్లు, చురుకుదనం తదితర అంశాలపై ఆధారపడి ఉంటుంది.
సెబీకి సహకరిస్తాం: జేన్ స్ట్రీట్
తాజా పరిణామాలపై జేన్ స్ట్రీట్ స్పందించింది. ప్రపంచవ్యాప్తంగా తాము అనేక దేశాల్లో ట్రేడింగ్ కార్యకలాపాలను నిర్వర్తిస్తున్నామని, అక్కడి రెగ్యులేటర్ల నిబంధనల్ని పాటిస్తున్నామని జేన్ స్ట్రీట్ రాయిటర్స్‌కు ఓ ఈ-మెయిల్ ద్వారా బదులిచ్చింది. ఈ సమస్య పరిష్కారానికి సెబీతో ప్రయత్నిస్తున్నామని కూడా చెప్పుకొచ్చింది. అయితే ఈ వ్యవహారంపై సెబీ దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నది. ఈ క్రమంలోనే భారతీయ సెక్యూరిటీస్ మార్కెట్లలో ప్రత్యక్షంగానైనా, పరోక్షంగానైనా ఎలాంటి క్రయవిక్రయాలకు దిగరాదంటూ జేన్ స్ట్రీట్‌పై నిషేధం విధించింది. 2000వ సంవత్సరంలో ఏర్పాటైన జేన్ స్ట్రీట్.. ప్రస్తుతం ప్రపంచంలోని అతిపెద్ద ప్రొప్రైటరీ ట్రేడింగ్ సంస్థల్లో ఒకటిగా ఉన్నది. ఈక్విటీలు, ఈటీఎఫ్‌లు, బాండ్లు, ఆప్షన్స్, క్రిప్టో ఇలా అనేక ఆస్తుల్లో ఏటా 17 ట్రిలియన్ డాలర్లకుపైగా ట్రేడింగ్‌ను చేస్తున్నది.
మార్కెట్లో అవకతవకల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదు. ఇప్పటికే అటు సెబీ, ఇటు ఎక్సేంజీల స్థాయిలో నిఘాను పెంచుతూపోతు న్నాం. అన్ని సెగ్మెంట్లలోనూ పారదర్శక లావాదేవీల దిశగా అడుగులు వేస్తున్నాం.
-తుహిన్ కాంత పాండే, సెబీ చైర్మన్
ఆప్షన్స్ ట్రేడింగ్‌లో దాదాపు 50 శాతంగా ఉన్న జేన్ స్ట్రీట్ వంటి ప్రొప్రైటరీ ట్రేడింగ్ సంస్థల భాగస్వామ్యం మార్కెట్లో తగ్గితే రిటైల్ ట్రేడింగ్ కార్యకలాపాలు ప్రభావితం కావచ్చు. ఇది అటు ఎక్సేంజీలకు, ఇటు బ్రోకర్లకు ఎదురుదెబ్బే.
-నితిన్ కామత్, జెరోధా సీఈవో
పెట్టుబడుల సమీకరణలో ఇప్పటికీ మార్కెట్లదే కీలకం. అలాంటిది ఎక్సేంజీల్లో, బ్రోకరేజీల్లో సాగుతున్న వ్యాపార విధానాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మదుపరులలో నమ్మకాన్ని కోల్పోయేలా మోసాలు వెలుగుచూస్తున్నాయి.
-ఉదయ్ కొటక్, కొటక్ మహీంద్రా బ్యాంక్