న్యూఢిల్లీ, సెప్టెంబర్ 18 : అమెరికా షార్ట్-సెల్లర్ హిండెన్‌బర్గ్ రిసెర్చ్.. అదానీ గ్రూప్, దాని అధినేత గౌతమ్ అదానీపై చేసిన సంచలన ఆరోపణల్ని భారతీయ క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ తోసిపుచ్చింది. ఈ వ్యవహారంలో గౌతమ్ అదానీగానీ, ఆయన గ్రూప్ సంస్థలుగానీ ఎలాంటి అవకతవకలకు పాల్పడలేదని, అందుకు తగ్గ ఆధారాలేవీ లేవంటూ గురువారం క్లీన్చిట్ ఇచ్చింది. ఈ మేరకు సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) సవివరంగా రెండు వేర్వేరు ఆదేశాలను జారీ చేసింది.
‘అదానీ గ్రూప్, గౌతమ్ అదానీలు ఇన్సైడర్ ట్రేడింగ్, మార్కెట్ మ్యానిపులేషన్, పబ్లిక్ షేర్‌హోల్డింగ్ నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడ్డారంటూ హిండెన్‌బర్గ్ చేసిన ఆరోపణలు మా సమగ్ర దర్యాప్తులో నిజం కాదని తేలింది’ అంటూ సెబీ స్పష్టం చేసింది. కాగా, 2023 జనవరిలో అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా హిండెన్‌బర్గ్ ఓ సంచలన నివేదికను విడుదల చేసిన విషయం తెలిసిందే. స్టాక్ మార్కెట్లలో నమోదైన అదానీ పవర్ లిమిటెడ్, అదానీ ఎంటర్ప్రైజెస్ లిమిటెడ్‌లకు వివిధ అదానీ గ్రూప్ సంస్థలకు మధ్య నిధుల బదిలీకి అడికార్ప్ ఎంటర్ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్, మైల్స్టోన్ ట్రేడ్‌లింక్స్ ప్రైవేట్ లిమిటెడ్, రెహ్వార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్‌లను అక్రమ మార్గాలుగా వినియోగించారని హిండెన్‌బర్గ్ ఆరోపించిన సంగతి విదితమే. అయితే ఈ అంశంలో సెబీ సమాచార వెల్లడి నిబంధనల్ని, మరే ఇతర రెగ్యులేషన్లను మీరినట్టు ఎక్కడా కనిపించలేదని సెబీ బోర్డ్ సభ్యుడు కమలేష్ సీ వర్ష్నే చెప్తున్నారు. మదుపరులను అదానీ గ్రూప్ తప్పుదారి పట్టించిందనడానికీ ఎలాంటి రుజువుల్లేవన్నారు.
కాబట్టి ఈ కేసులో అదానీ సంస్థలపైగానీ, వాటిలోని ఉద్యోగులపైగానీ చర్యలు తీసుకోవాల్సిన లేదా జరిమానాలు వేయాల్సిన అవసరం లేదన్న నిర్ణయానికి సెబీ వచ్చినట్టు పేర్కొన్నారు. ఇందులోభాగంగానే అదానీ పోర్ట్స్, అదానీ పవర్, అదానీ ఎంటర్ప్రైజెస్, అడికార్ప్ ఎంటర్ప్రైజెస్, మైల్స్టోన్ ట్రేడ్‌లింక్స్, రెహ్వార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గౌతమ్ అదానీ, ఆయన సోదరుడు రాజేశ్ అదానీ, గ్రూప్ సీఎఫ్‌వో జుగేశిందర్ సింగ్‌లపై వచ్చిన ఆరోపణలపై క్లీన్చిట్ ఇస్తున్నట్టు సెబీ ఆర్డర్ తెలిపింది. నిధుల దుర్వినియోగం జరగలేదని, తీసుకున్న రుణాలను వడ్డీతోసహా చెల్లించారన్నది. ఇక ఈ కేసుపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టు కూడా గతంలోనే ఓ నిపుణుల కమిటీని వేయగా, సదరు ప్యానెల్ సైతం ఎలాంటి అక్రమాలు జరగలేదన్నది తెలిసిందే. కాగా, హిండెన్‌బర్గ్ రిపోర్టుతో స్టాక్ మార్కెట్లలో లిస్టింగైన అదానీ గ్రూప్ సంస్థల మార్కెట్ విలువ 150 బిలియన్ డాలర్లకుపైగా (సుమారు రూ.14 లక్షల కోట్లు) పడిపోయింది. ఇదిలావుంటే హిండెన్‌బర్గ్ రిసెర్చ్‌ను ఈ ఏడాది జనవరిలో మూసివేస్తున్నట్టు దాని యాజమాన్యం, నిర్వహకులు ప్రకటించినది విదితమే.
తనపై, తన గ్రూప్ సంస్థలపై హిండెన్‌బర్గ్ రిసెర్చ్ చేసిన ఆరోపణలు ముమ్మాటికీ నిరాధారమైనవేనని, ముందు నుంచీ తాను ఇదే చెప్తున్నానని అదానీ గ్రూప్ అధిపతి గౌతమ్ అదానీ వ్యాఖ్యానించారు. అయినప్పటికీ అసత్య ప్రచారం జరిగిందన్న ఆయన.. దీనివల్ల అమాయక మదుపరులు నష్టపోయారన్నారు. ఈ క్రమంలోనే ‘హిండెన్‌బర్గ్ రిసెర్చ్ మోసపూరిత, కల్పిత నివేదిక ఆధారంగా తప్పుడు కథనాలు, వార్తలు రాసినవారంతా జాతికి క్షమాపణ చెప్పాలి’ అని ‘ఎక్స్’ వేదికగా డిమాండ్ చేశారు. అదానీ గ్రూప్ ఎప్పుడూ చేసేదే సెబీ ఇప్పుడు చెప్పిందని హర్షం వ్యక్తం చేశారు. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని మరొక్కసారి అదానీ నొక్కిచెప్పారు.