SEBI | మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాదారులకు స్టాక్ మార్కెట్ల నియంత్రణ సంస్థ ‘సెబీ’ రిలీఫ్ కల్పించింది. డీమ్యాట్, మ్యూచువల్ ఫండ్స్ ఖాతాదారులు తమ నామినీల పేర్లు నమోదు చేయడానికి గడువు 2024 జూన్ 30 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఇంతకుముందు సెప్టెంబర్ 26న ఈ నెల 31 వరకూ మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాల నామినీల పేర్లు నమోదు చేసేందుకు డెడ్ లైన్ విధించింది.
ఇన్వెస్టర్ల పెట్టుబడులకు భద్రత కల్పించేందుకు, అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే.. వారి పెట్టుబడులు, ఆయా పెట్టుబడులపై రిటర్న్స్‌ను ఖాతాదారుల వారసులకు అప్పగించేందుకు నామినీ డిక్లరేషన్ సమర్పించాలని సెబీ సూచించింది.
‘మార్కెట్ భాగస్వాముల నుంచి అభ్యర్థనలు, ఇన్వెస్టర్ల సౌకర్యార్థం డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్స్ మదుపర్లు తమ నామినీ డిక్లరేషన్ సమర్పించేందుకు గడువు పొడిగించాం’ అని సెబీ తన సర్క్యులర్‌లో పేర్కొన్నది. డీమ్యాట్ ఖాతాదారులు, మ్యూచువల్ ఫండ్స్ యూనిట్ హోల్డర్లు తమ నామినీ డిక్లరేషన్ సమర్పించేలా ప్రోత్సహించాలని మ్యూచువల్ ఫండ్స్ నిర్వహణ సంస్థలు.. అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ), డిపాజిటరీ పార్టిసిపెంట్లు, రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్లను (ఆర్టీఏ) సెబీ కోరింది.