ముంబై/న్యూఢిల్లీ, నవంబర్ 7 : షార్ట్ సెల్లింగ్ సమగ్ర సమీక్షకు ఓ వర్కింగ్ గ్రూప్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ చైర్మన్ తుహిన్ కాంత పాండే తెలిపారు. శుక్రవారం ఇక్కడ నిర్వహించిన సీఎన్‌బీసీ-టీవీ18 గ్లోబల్ లీడర్షిప్ సదస్సులో ఆయన మాట్లాడుతూ.. షార్ట్ సెల్లింగ్తోపాటు సెక్యూరిటీస్ లెండింగ్ అండ్ బారోయింగ్ (ఎస్ఎల్బీ) విధివిధానాలనూ సమీక్షిస్తామని చెప్పారు. కాగా, 2007లో షార్ట్ సెల్లింగ్ ఫ్రేమ్‌వర్క్ పరిచయమైంది. అయితే ప్రారంభమై దాదాపు 2 దశాబ్దాలు కావస్తున్నా.. ప్రస్తుత పరిస్థితులకు తగ్గట్టు ఏ మార్పులూ లేకుండా షార్ట్ సెల్లింగ్ విధివిధానాలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. 2008లో మొదలైన ఎస్ఎల్బీ పద్ధతి సంగతీ ఇంతే. అయితే కొద్దిసార్లు సవరణలు చేసినా.. గ్లోబల్ మార్కెట్లకు తగ్గట్టు మాత్రం తీర్చిదిద్దలేకపోయారు. ఈ క్రమంలోనే వీటిని పునఃసమీక్షించాల్సిన అవసరం ఇప్పుడు ఉందని పాండే అన్నారు. అందుకే ఇందుకోసం ఓ వర్కింగ్ గ్రూప్‌ను త్వరలోనే ఏర్పాటు చేస్తామని సెబీ చీఫ్ స్పష్టం చేశారు.
ఎస్ఎల్బీ విధానంలో మదుపరులు లేదా సంస్థలు తమ డీమ్యాట్ ఖాతాల్లో ఉన్న షేర్లను ఇతర మార్కెట్ పార్టిసిపెంట్స్‌కు కొంత ఫీజుపై అప్పుగా ఇస్తారు. ఈ లావాదేవీలన్నీ స్టాక్ ఎక్సేంజ్ వేదికగానే జరుగుతాయి. ఇక షేర్లను అప్పుగా తీసుకున్నవారు షార్ట్ సెల్లింగ్ లేదా సెటిల్మెంట్ వైఫల్యాల నిరోధానికి వినియోగిస్తారు. తద్వారా అదనపు ఆదాయాన్ని ఆర్జిస్తారు. దీనివల్ల షేర్లు లేదా సెక్యూరిటీలను అప్పుగా ఇచ్చినవారికి, తీసుకున్నవారికీ లాభమని మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఇక స్టాక్ బ్రోకర్, మ్యూచువల్ ఫండ్ రెగ్యులేషన్స్‌పై ఇప్పటికే సమగ్ర సమీక్ష జరుగుతున్నదని పాండే ఈ సందర్భంగా వెల్లడించారు. ‘త్వరలోనే లిస్టింగ్ ఆబ్లిగేషన్స్-డిస్క్లోజర్ రిక్వైర్మెంట్స్ (ఎల్‌వోడీఆర్) 2015తోపాటు సెటిల్మెంట్ రెగ్యులేషన్స్‌ను లోతుగా సమీక్షిస్తాం’ అన్నారు.
విదేశీ పోర్ట్‌ఫోలియో మదుపరులు (ఎఫ్‌పీఐలు) గతకొంత కాలంగా భారతీయ మార్కెట్ల నుంచి తమ పెట్టుబడులను పెద్ద ఎత్తున అదే పనిగా వెనక్కి తీసుకుంటుండటం ఆందోళనకరమైన అంశంగా ఉన్నది. దీంతో దీనిపైనా పాండే స్పందించారు. దేశ వృద్ధిరేటులో విదేశీ మదుపరుల పాత్ర పెద్దదని, ఇకపైనా వారి నుంచి మద్దతు ఉంటుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేస్తూనే.. ప్రైమరీ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్స్‌లో ఎఫ్‌పీఐ కార్యకలాపాల ప్రమేయం ఉంటుందని, అందుకే అవి సహజంగానే సెకండరీ మార్కెట్ కదలికల్ని ప్రభావితం చేస్తాయని చెప్పారు. ఇక దేశీయ మార్కెట్లలో స్థానిక మదుపరుల భాగస్వామ్యం పెరిగిందని, ముఖ్యంగా సంస్థాగత మదుపరుల పెట్టుబడులు చాలా బలంగా ఉన్నాయని, కాబట్టి విదేశీ పెట్టుబడుల ఉపసంహరణలతో ఏర్పడే ఒడిదొడుకుల్ని తట్టుకునే సామర్థ్యం భారతీయ మార్కెట్లకు ఉందని, భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు. కాగా, మార్కెట్ క్యాపిటలైజేషన్లో దాదాపు 900 బిలియన్ డాలర్ల మేర ఎఫ్‌పీఐ పెట్టుబడులున్నాయి. ఇదిలావుంటే వీక్లీ ఎక్స్పైర్స్పై నిషేధాన్ని పరిశీలించారా? అన్న ప్రశ్నకు పాండే సమాధానం దాటవేశారు. భాగస్వాములందరితో సంప్రదించాకే భవిష్యత్తులో ఏ నిర్ణయాలైనా ఉంటాయన్నారు.
రిటైల్ ఇన్వెస్టర్ల ప్రయోజనాల రక్షణకే సెబీ పెద్దపీట వేస్తుందని, మార్కెట్ మోసాల నుంచి వారిని రక్షించేందుకు కట్టుదిట్టమైన రక్షణ కవచాన్ని ఇంకెలా నిర్మించాలనేదానిపైనే దృష్టి పెట్టామని సెబీ బోర్డులోని శాశ్వత సభ్యుడు కమలేష్ వర్షిణి తెలిపారు. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్స్ (ఐపీవోలు) విలువపై స్పందిస్తూ ఆయన పైవిధంగా స్పందించారు. ఈ అంశంలో రెగ్యులేటరీ గ్యాప్ ఏమీ లేదన్నారు. మరోవైపు ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్స్ (ఏఐఎఫ్‌లు)లో మదుపరుల ప్రో-రాట, పారీ-పస్సు హక్కుల నిర్వహణ కార్యాచరణ అంశాలపై సెబీ ఓ డ్రాఫ్ట్ సర్క్యులర్‌ను శుక్రవారం తీసుకొచ్చింది. భాగస్వాముల అభిప్రాయాలను తీసుకున్న తర్వాత దీనిపై ఓ తుది నిర్ణయం తీసుకునే వీలుందని చెప్తున్నారు.