SEBI | ముంబై, సెప్టెంబర్ 2: పెట్టుబడులను ప్రోత్సహించడంలో భాగంగా మార్కెట్ నియంత్రణ మండలి సెబీ మరో కీలక నిర్ణయం తీసుకోబోతున్నది. సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (సిప్) కింద నెలకు రూ.250 చొప్పున మ్యూచువల్ పండ్లలో పెట్టుబడులు పెట్టే అవకాశాలు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. స్టార్‌బక్స్‌లో కాఫీకి పెట్టే ఖర్చు స్థాయిలోనే సిప్‌లో పెట్టుబడులు పెట్టే సమయం త్వరలో రాబోతున్నదని సెబీ చైర్మన్ మాధాబి బచ్ పురి ఈ సందర్భంగా తెలిపారు.
ఈ బృహత్ ప్రణాళికపై అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా(యాంఫీ)తోపాటు కీలక సంస్థలతో సంప్రదింపులు జరిపినట్లు భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) ఏర్పాటు చేసిన వార్షిక సదస్సులో వెల్లడించారు. తక్కువ స్థాయి పెట్టుబడి ప్రతిపాదనను మరింత సమర్థవంతంగా అమలు చేయడానికి సాంకేతిక పరంగా మార్పులు చేయాల్సిన అవసరం కూడా ఉన్నదన్నారు. మరోవైపు, సింగిల్ ఫైలింగ్‌తో స్టాక్ ఎక్సేంజ్‌ల్లో లిస్ట్ అయ్యేందుకు వీలుపడనున్నది.
స్టాక్ మార్కెట్లో మదుపరుల పెట్టుబడులపై సెబీ ప్రత్యేక నివేదికను విడుదల చేసింది. ఐపీవోలో షేర్లు అలాట్మెంట్ జరిగిన వారంలోనే 54 శాతం షేర్లను మదుపరులు విక్రయిస్తున్నట్లు సెబీ అధ్యయనంలో వెల్లడైంది. నష్టాలు వచ్చినప్పటితో పోలిస్తే లాభాలు వచ్చినప్పుడు ఈ తరహా విక్రయాలు ఎక్కువగా ఉంటున్నాయని పేర్కొంది. 2021 నుంచి 2023 వరకు 144 ఐపీవోల డాటా ఆధారంగా ఈ నివేదికను రూపొందించింది.