న్యూఢిల్లీ, అక్టోబర్ 24: ఈక్విటీ షేర్లు, సంబంధిత సాధనాల ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్లలో పాల్గొనకుండా మ్యూచువల్ ఫండ్ స్కీములను సెక్యూరిటీస్ అండ్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా నిషేధించింది. యాంకర్ ఇన్వెస్టర్ కోటా లేదా ఇనీషియల్ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) వంటి పబ్లిక్ ఇష్యూల్లో మాత్రమే పెట్టుబడులు పెట్టేందుకు అనుమతించింది. ఈ మేరకు భారతీయ మ్యూచువల్ ఫండ్స్ సంఘానికి (యాంఫీ) రాసిన లేఖలో సెబీ స్పష్టం చేసింది. సెబీ (మ్యూచువల్ ఫండ్స్) రెగ్యులేషన్స్ 1996లోని 7వ షెడ్యూల్ 11వ క్లాజ్‌ను వివరిస్తూ.. స్టాక్ మార్కెట్లలో నమోదైన, త్వరలో నమోదు కాబోతున్న సెక్యూరిటీల్లో మాత్రమే ఈక్విటీ షేర్లు, ఈక్విటీ సంబంధిత సాధనాల్లో మ్యూచువల్ ఫండ్ స్కీముల పెట్టుబడులుండాలన్నది. యాంకర్ లేదా పబ్లిక్ ఇష్యూ ప్రారంభానికి ముందు జరిగే ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్లలో మ్యూచువల్ ఫండ్స్ పాల్గొనవచ్చా? లేదా? అన్న ప్రశ్నలకుగాను సెబీ పైవిధంగా స్పష్టత ఇచ్చింది. ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్లలో పాల్గొనేందుకు అవకాశం ఇస్తే.. ఒకవేళ ఐపీవో ఆలస్యమవడం లేదా రద్దవడం జరిగితే అన్‌లిస్టెడ్ షేర్లలో మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులున్నట్టు అవుతుందని, ఇది రెగ్యులేటరీ నింధనలను ఉల్లంఘించినట్టే అవుతుందని సెబీ ఈ సందర్భంగా యాంఫీకి రాసిన లేఖలో తెలియజేసింది.
ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్లలో పెట్టుబడులకు మ్యూచువల్ ఫండ్స్‌ను అనుమతించడం ప్రమాదమనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సెబీ అధికారుల్లో ఒకరు అంటున్నారు. ఒకవేళ సదరు సంస్థ ఏదైనా కారణం చేత ఐపీవోకు రాకపోతే.. మ్యూచువల్ ఫండ్స్ స్కీముల్లో అన్‌లిస్టెడ్ షేర్లు ఎలా భాగం అవుతాయని, మదుపరులకు దీనివల్ల నష్టాలు వాటిల్లుతాయని చెప్పారు. మదుపరుల ప్రయోజనాలకు పెద్దపీట వేసే నిర్ణయాలనే సెబీ తీసుకుంటుందని స్పష్టం చేశారు. స్టాక్ మార్కెట్లలో రకరకాల మోసాలు జరుగుతున్న నేపథ్యంలో అమాయక మదుపరుల రక్షణార్థం ప్రతీ అంశంపై లోతుగా దృష్టిసారిస్తున్నామనీ పేర్కొన్నారు.
సెబీ తాజా నిర్ణయం.. కొన్ని మ్యూచువల్ ఫండ్స్‌కు భారీ ఎదురుదెబ్బగా మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అనేక మ్యూచువల్ ఫండ్స్.. మార్కెట్లో తమ లాభాలకు ప్రీ-ఐపీవోనే గొప్ప అవకాశంగా భావిస్తున్నాయి మరి. ప్రైవేట్ ఇన్వెస్టర్లకు ఈ ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్లలో పెట్టుబడులు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఐపీవోల్లో షేర్ల ధరలు పెరిగే వీలున్నందున తక్కువకే బడా మదుపరులు ఈ ప్రీ-ఐపీవో ప్లేస్మెంట్ మార్గాల ద్వారా ఆయా షేర్లను జేబులో వేసుకుంటున్నారు. అయితే సెబీ ఇప్పుడు దీనికి చెక్ పెట్టింది. దీంతో ఇండస్ట్రీలో ఇప్పుడిదే హాట్ టాపిక్‌గా మారింది. సెబీ నిషేధంతో మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడులు లాభదాయకం కావన్న భావన ఇన్వెస్టర్లలో పెరగవచ్చన్న ఆందోళనల్ని మ్యూచువల్ ఫండ్స్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు తమ నిర్ణయాన్ని వెంటనే అన్ని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఏఎంసీ)లకు తెలియపర్చాలని యాంఫీకి సెబీ సూచించింది.
ఒక పోర్ట్‌ఫోలియో మేనేజర్ నుంచి మరొక పోర్ట్‌ఫోలియో మేనేజర్‌కు పోర్ట్‌ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ (పీఎంఎస్) వ్యాపారం బదిలీ కోసం శుక్రవారం సెబీ ఓ క్రమబద్ధీకరించిన ప్రక్రియను పరిచయం చేసింది. ఈ కొత్త విధానంలో సెబీ నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నాకే పోర్ట్‌ఫోలియో మేనేజర్ తమ పీఎంఎస్ వ్యాపారాన్ని బదిలీ చేయగలరు. ఇదిలావుంటే నాన్-కన్వర్టబుల్ సెక్యూరిటీస్ కలిగిన సంస్థల అన్క్లెయిమ్డ్ నగదు కోసం నిబంధనల సవరణకు సెబీ యోచిస్తున్నది.