న్యూఢిల్లీ, నవంబర్ 10 : రికార్డుస్థాయిలో పరుగులు పెడుతున్న బంగారం ధరలు.. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్కున్న రకరకాల మార్గాలపట్ల మదుపరులను విపరీతంగా ఆకర్షింపజేస్తున్నాయి. ఈ క్రమంలోనే కొందరు సంప్రదాయ పద్ధతిలో పసిడి నాణేలు, బిస్కట్లు, కడ్డీలు, నగలను కొనేందుకు ఇష్టపడుతుంటే.. ఇంకొందరు డిజిటల్ గోల్డ్, గోల్డ్ ఈటీఎఫ్‌లు, బాండ్లు, సెక్యూరిటీలవైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇదే అదనుగా ఇటీవలికాలంలో డిజిటల్ మోసాలు విజృంభిస్తున్నాయి. దీంతో సెక్యూరిటీస్ ఎక్సేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) అప్రమత్తమైంది. తాజాగా డిజిటల్ గోల్డ్ సాధనాల్లో పెట్టుబడుల గురించి మదుపరులను హెచ్చరించిన విషయమూ తెలిసిందే. సెబీ నియంత్రిత గోల్డ్ ప్రొడక్ట్స్‌తో పోల్చితే అవి భిన్నంగా ఉంటాయని, అమాయక ఇన్వెస్టర్లు రిస్క్లోపడే ప్రమాదం ఉందన్న సంగతీ విదితమే. దీంతో ఇన్నాళ్లూ డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడులు పెడుతూ వచ్చిన వారంతా ఇప్పుడు ఒక్కసారిగా భయాందోళనలకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే తమ పెట్టుబడులను అలాగే ఉంచుదామా? లేక వెనక్కి తీసుకుందామా? అన్న డైలమాలో పడిపోయారు.
‘కొన్ని డిజిటల్, ఆన్లైన్ వేదికలు ఆయా ‘డిజిటల్ గోల్డ్/ఈ-గోల్డ్ ప్రొడక్ట్స్’లో పెట్టుబడులు పెట్టేలా ఇన్వెస్టర్లకు రకరకాల ఆఫర్లు చేస్తున్నట్టు మా దృష్టికి వచ్చింది. భౌతిక బంగారంలో పెట్టుబడి కోసం ప్రత్యామ్నాయంగా ఉన్నదే ఈ డిజిటల్ గోల్డ్. అయితే మా నియంత్రణలో ఉన్న గోల్డ్ ప్రొడక్ట్స్‌తో చూస్తే.. సదరు డిజిటల్ గోల్డ్ ప్రొడక్ట్స్ భిన్నమైనవి. ఎందుకంటే అవి సెక్యూరిటీలుగాగానీ లేదా కమోడిటీ డెరివేటివ్లుగాగానీ నమోదు కాలేదు. మా పరిధిని దాటి అవన్నీ పనిచేస్తూ ఉంటాయి. ఒకవేళ రేపటి రోజున అవి మూతబడితే మదుపరులు నష్టపోయినట్టే. సెబీ మదుపరి రక్షణ వ్యవస్థ కింద మీరు ఉండరు కాబట్టి చట్టరీత్యా మేమూ ఏమీ చేయలేని పరిస్థితి. కనుక మదుపరులు ఈ రకమైన పెట్టుబడుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి’ అని సెబీ గత వారం ఓ సర్క్యులర్‌లో స్పష్టం చేసింది.
గోల్డ్, గోల్డ్ సంబంధిత సాధనాల్లో పెట్టుబడులు పెట్టాలనుకునే మదుపరులు సెబీ రెగ్యులేటెడ్ గోల్డ్ ప్రొడక్ట్స్‌ను పరిశీలించవచ్చు. మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌పై ట్రేడయ్యే ఎక్సేంజ్-ట్రేడెడ్ కమోడిటీ డెరివేటివ్ కాంట్రాక్టులు, మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేసే గోల్డ్ ఎక్సేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌లు), స్టాక్ ఎక్సేంజీల్లో ట్రేడయ్యే ఎలక్ట్రానిక్ గోల్డ్ రిసిప్ట్స్ (ఈజీఆర్‌లు) వంటివి అందుబాటులో ఉన్నాయని సెబీ చెప్తున్నది. అలాగే సెబీ రెగ్యులేటెడ్ ఇంటర్మీడియరీల ద్వారానే ఈ పెట్టుబడులకు వెళ్లాలని, అప్పుడే తమ విధివిధానాలకు లోబడి మదుపరుల పెట్టుబడులు రక్షణాత్మకంగా ఉంటాయని సూచిస్తున్నది.
బంగారం ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. సోమవారం ఒక్కరోజే ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాములు రూ.1,300 పుంజుకొని రేటు రూ.1,25,300ను తాకింది. కిలో వెండి విలువ కూడా రూ.2,460 ఎగసి రూ.1,55,760కి ఎగబాకింది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ తులం రూ.1,800 పెరిగి రూ.1,23,820గా నమోదైంది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) రూ.1,650 అందుకొని రూ.1,13,500కు చేరుకున్నది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ 83.12 డాలర్లు ఎగసి 4 వేల డాలర్ల మార్కుకు ఎగువన 4,082.84 డాలర్ల వద్ద ముగిసింది. అలాగే సిల్వర్ 49.93 డాలర్లకు పెరిగింది. కాగా, అమెరికా స్థూల ఆర్థిక గణాంకాలు బలహీనంగా ఉండటంతో మదుపరులు తమ పెట్టుబడుల రక్షణార్థం పసిడి వైపునకు కదులుతుండటమే ధరల పెరుగుదలకు కారణమని ట్రేడర్లు మార్కెట్ సరళిని విశ్లేషిస్తున్నారు.
సెబీ నియంత్రిత ప్రొడక్ట్స్‌లో మీ డిజిటల్ గోల్డ్ పెట్టుబడులు లేకపోతే వాటిని తక్షణమే ఉపసంహరించుకోండి. దీనివల్ల మదుపరులకు కొంతమేర నష్టం వాటిల్లవచ్చు. అయితే 100 శాతం నష్టపోయే ప్రమాదం నుంచి మాత్రం తప్పించుకుంటారు. ఆకర్షణీయ యాప్‌ల మాయలోపడి, విశ్వసనీయతను గాలికి వదిలేయవద్దు. గోల్డ్ ఈటీఎఫ్‌లు, ఈ-గోల్డ్ రిసిప్ట్లు సెబీ రెగ్యులేటెడ్ ప్రొడక్ట్స్. వీటిలో పెట్టుబడులు సురక్షితం. చట్టపరమైన రక్షణ కూడా ఉంటుంది.
ఫిన్‌టెక్ యాప్స్, వ్యాలెట్లు లేక సెబీ నియంత్రణలో లేని ఇతర వేదికల ద్వారా డిజిటల్ గోల్డ్/ఈ-గోల్డ్‌ను కొన్నవారు లేదా కలిగి ఉన్నవారు ఇకపై జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మీ పెట్టుబడులపై రాబడులను అందుకోవడానికి, భౌతిక బంగారంగా మార్చుకోవడానికి ఇబ్బందులు తలెత్తే వీలున్నది. అయినప్పటికీ పెట్టుబడులను రేపే వెనక్కి తీసుకోవాలన్న భయాలేమీ అక్కర్లేదు. అయితే మీరు పెట్టుబడులు పెట్టిన యాప్/సంస్థల వాల్టింగ్, బ్యాకింగ్, రిడెంప్షన్ నిబంధనలు, ఫీజులు, లిక్విడిటీల గురించి ఆరా తీయడం ఉత్తమం.
ఇటీవలి కాలంలో డిజిటల్ గోల్డ్‌పై పెట్టుబడులు పెద్ద ఎత్తున పెరుగుతున్నాయి. ముఖ్యంగా యువ మదుపరులు వీటిపట్ల అమితాసక్తిని కనబరుస్తున్నారు. నిజానికి సెబీ తాజా హెచ్చరికలు ఈ పెట్టుబడులను నిరుత్సాహపర్చడానికేమీ కాదు. అయినప్పటికీ మదుపరులు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. కనుక విశ్వసనీయమైన, పారదర్శకమైన వేదికల్లోనే పెట్టుబడులు పెట్టండి. ఇప్పటికిప్పుడు డిజిటల్ గోల్డ్ మదుపరులు భయపడాల్సిన అవసరమేమీ లేదు. పెట్టుబడుల ఉపసంహరణల గురించి ఆలోచించకండి. అయితే మీ పెట్టుబడుల స్వరూపం ఎలా ఉన్నది? భద్రంగా నిల్వ చేస్తున్నారా? అనేది తెలుసుకోండి.
డిజిటల్ గోల్డ్‌లో పెట్టుబడులు పెట్టేముందు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా పరిశీలించండి. డిజిటల్ గోల్డ్ అనేది సెబీ పరిధిలోకి రాని అంశం. కాబట్టి స్పష్టమైన విధివిధానాలేమీ ఉండవు. కనుక మదుపరులకు నష్టాలు వాటిల్లే ప్రమాదం ఉన్నది. మీ కష్టార్జితాన్ని సురక్షిత పెట్టుబడి సాధనాల్లో పెట్టడమే మంచిది.