SBI | ముంబై, నవంబర్ 8: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఆర్థిక ఫలితాల్లో అంచనాలకుమించి రాణించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.19,782 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని ఆర్జించింది. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.16,099 కోట్ల లాభంతో పోలిస్తే 23 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. ఏకీకృత విషయానికి వస్తే బ్యాంక్ రూ.18,331 కోట్ల లాభాన్ని గడించింది. అటు ఆదాయంలోనూ రికార్డు నెలకొల్పింది. గత త్రైమాసికంలో బ్యాంక్ రూ.1.29 లక్షల కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. బ్యాంక్ చైర్మన్గా సీఎస్ శెట్టి పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇంతటి స్థాయిలో ఆదాయం ఆర్జించడం ఇదే తొలిసారి. ఏడాది క్రితం ఇది రూ.1.12 లక్షల కోట్లుగా ఉన్నది. సమీక్షకాలంలో బ్యాంక్ నిర్వహణ ఖర్చులు రూ.92,752 కోట్ల నుంచి రూ.99,847 కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు.
ప్రొవిజనింగ్ రెండింతలు
మొండి బకాయిలను పూడ్చుకోవడానికి బ్యాంక్ అధిక స్థాయిలో నిధులను కేటాయించింది. గత త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.3,631 కోట్ల నిధులను కేటాయించింది. అంతక్రితం ఏడాది రూ.1,814 కోట్లతో పోలిస్తే రెండు రెట్లు పెరిగినట్లు బ్యాంక్ వర్గాలు వెల్లడించాయి. అలాగే బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.21 శాతం నుంచి 2.13 శాతానికి తగ్గగా, నికర ఎన్పీఏ మాత్రం స్వల్పంగా పెరిగి 0.53 శాతానికి చేరుకున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అడ్వాన్స్ల్లో 14-16 శాతం మధ్యలో వృద్ధి నమోదుకానుండగా, డిపాజిట్లలో మాత్రం 10 శాతం మించే అవకాశాలు లేవు. డిపాజిట్లను ఆకట్టుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలతో ఈ ఏడాది రెండంకెల వృద్ధి ఆశిస్తున్నాం. ఒక ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. తొలి ఆరు నెలల్లో ఆపరేటింగ్ ప్రాఫిట్ రూ.64 వేల కోట్లుగా నమోదైంది. వచ్చే ఫిబ్రవరి లోపు రిజర్వు బ్యాంక్ వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు లేవు.
– సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్