SBI Report | దేశీయ స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్టర్ల సంఖ్య పెరుగుతూ వస్తున్నది. దాంతో డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య గణనీయంగా పెరగడాన్ని బట్టి తెలుస్తున్నది. గత పదేళ్లలో కొత్త డీమ్యాట్ అకౌంట్ల సంఖ్య 39 రెట్లు పెరిగిందని ఎస్బీఐ నివేదిక పేర్కొంది. 2014లో దేశంలో 10లక్షల డీమ్యాట్ అకౌంట్లు తెరువగా.. 2024 అక్టోబర్ నాటికి రికార్డు స్థాయిలో 3.91కోట్లకు చేరింది. ఈ ఏడాది కొత్త డీమ్యాట్ ఖాతాల సంఖ్య నాలుగు కోట్లు దాటుతుందని అంచనా. 2021 క్యాలెండర్ ఇయర్ నుంచి ఏటా దాదాపు మూడుకోట్లకుపైగానే డీమ్యాట్ ఖాతాలు ఓపెన్ అవుతున్నాయని.. అంటే ఏటా పెద్ద సంఖ్యలో ఇన్వెస్టర్లు స్టాక్ మార్కెట్లోకి చేరుతున్నట్లుగా నివేదిక పేర్కొంది. 2013-14లో 2.20 కోట్లుగా ఉన్న డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2023-24 ఆర్థిక సంవత్సరం నాటికి 15 కోట్లు దాటుతుందని నివేదిక తెలిపింది. ఇందులో ఎన్ఎస్ఈ ఇన్వెస్టర్ల సంఖ్య 9.2 కోట్లు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకు డీమ్యాట్ ఖాతాల సంఖ్య 17.76 కోట్లకు పెరిగింది.
మార్కెట్లో ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడంతో 2013-14 ఆర్థిక సంవత్సరం నుంచి నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) మార్కెట్ క్యాపిటల్ ఆరు రెట్లు పెరిగింది. 2013-24లో ఎన్ఎస్ఈ మార్కెట్ క్యాపిటల్ రూ.73,000 కోట్లు కాగా.. 2024-25 నాటికి అది రూ.441 లక్షల కోట్లకు పెరిగింది. ఎన్ఎస్ఈలో ఒక్కో ఇన్వెస్టర్ సగటు పెట్టుబడి ఒకటిన్నర రెట్లు పెరిగింది. 2013-14లో ప్రతి పెట్టుబడిదారుడు సగటున రూ.19,460 పెట్టుబడి పెట్టగా.. ఇప్పుడు అది 2024-25లో రూ.30,742కి ఎగిసింది. 2013-14 నుంచి 2024-25 అక్టోబర్ వరకు రైట్స్ ఇష్యూ, ఐపీఓ, ఇతర అంశాల ద్వారా 10 రెట్లు అధికంగా నిధులు సమీకరించారు. 2014లో ఇది రూ.12,008 కోట్లు కాగా, ఈ ఏడాది అక్టోబర్ నాటికి రూ.1.21 లక్షల కోట్లకు పెరిగింది. 2013-14లో మొత్తం 56 ఇష్యూలు జారీ చేయగా, ఇప్పుడు వాటి సంఖ్య 302కి పెరిగింది. వెస్ట్రన్ స్టేట్స్ అత్యధిక మూలధనాన్ని (54శాతం) సేకరించాయి. ఉత్తర భారతదేశానికి చెందిన కంపెనీలు 23.18శాతం మొత్తాన్ని సమీకరించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు మొత్తం 4.85 కోట్ల కొత్త సిప్ ఖాతాలు తెరవగా.. 2017-18లో వారి సంఖ్య 1.16 కోట్లుగా ఉంది. ఈ కాలంలో సిప్ ద్వారా పెట్టుబడి పెట్టిన మొత్తం 2017-18లో రూ.67,000 కోట్ల నుంచి రూ.1.85 లక్షల కోట్లకు చేరింది.