న్యూఢిల్లీ, ఆగస్టు 3: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నిరాశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానిగాను బ్యాంక్ రూ.17,035 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.16,884 కోట్ల లాభంతో పోలిస్తే కేవలం ఒక్క శాతం లోపు పెరుగుదల నమోదైంది. మొండి బకాయిలను పూడ్చుకోవడానికి అధికంగా నిధుల కేటాయించడం వల్లనే లాభాల్లో గండిపడిందని పేర్కొంది. వరుస త్రైమాసికాలతో పోలిస్తే 17.7 శాతం తగ్గింది. సమీక్షకాలంలో బ్యాంక్ ఆదాయం రూ.1,08,039 కోట్ల నుంచి రూ.1,22,688 కోట్లకు చేరుకున్నట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. దీంట్లో వడ్డీల ద్వారా వచ్చే ఆదాయం రూ.95,975 కోట్ల నుంచి రూ.1,11,526 కోట్లకు పెరిగినట్లు తెలిపింది.