SBI on Gold Loan | వ్యవసాయం/ పిల్లల చదువులు/ వ్యాపార నిమిత్తమో అత్యవసరంగా డబ్బులు అవసరమైతే.. సులభతరమైన.. సౌకర్యవంతమైన మార్గం.. బంగారంపై రుణాలే ఆధారం.. బంగారం ఆభరణాలపై తక్కువ పేపర్‌వర్క్.. తక్కువ వడ్డీరేటుపై లభించేవి బంగారం రుణాలే. మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి రుణాలు తీసుకోవచ్చు. అయితే, ఇప్పుడు దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారులకు బంపరాఫర్ అందుబాటులోకి తెచ్చింది. బంగారంపై రుణాలకు ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం డిస్కౌంట్ ఇస్తున్నట్లు తన ట్విట్టర్ ఖాతాలో ప్రకటించింది.
స్పీడ్‌గా లోన్ మంజూరు చేయడంతోపాటు మీకు వెసులుబాటుతో కూడిన రీపేమెంట్ విధానాన్ని ఎంచుకునేందుకు ఎస్బీఐ అనుమతి ఇస్తున్నది. ఎస్బీఐ అనుబంధ యోనో యాప్ ద్వారా తేలిగ్గా బంగారం తాకట్టు రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 18 ఏండ్లు దాటి, నిరంతర ఆదాయం పొందుతున్న వారెవరైనా బంగారంపై రుణాలు తీసుకోవచ్చు. పెన్షనర్లు కూడా పసిడిపై లోన్ తీసుకునేందుకు అనుమతిస్తున్నారు. కనీసం రూ.20 వేల నుంచి గరిష్ఠంగా రూ.50 లక్షల వరకు లోన్ పొందొచ్చు.
లోన్ తీసుకునే వారు తాము తాకట్టు పెట్టే బంగారం నాణ్యత, పరిమాణం చెక్ చేసుకున్నాకే బ్యాంక్ అధికారులకు అప్పగించాలి. బంగారంపై రుణాలకు 0.25 శాతం లేదా రూ.250 జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. బంగారంపై రుణాలు తీసుకునేవారు ప్రాసెసింగ్ ఫీజు, సదరు రుణంపై వడ్డీరేటు, రుణం గడువు తదితర విషయాలను పరిగణనలోకి తీసుకోవాలి. బంగారం తాకట్టుపై ఎస్బీఐలో తీసుకునే రుణం చెల్లించడానికి మూడేండ్ల వరకు గడువు ఉంటుంది.