ముంబై, మే 7: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఎమర్జన్సీ క్రెడిట్ లైన్ గ్యారెంటీ స్కీమ్ (ఈసీఎల్జీఎస్) 5.0 కింద మరో రూ.80,000 కోట్లదాకా రుణాలిచ్చే అవకాశాలున్నాయి. ఈ మేరకు గురువారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి తెలిపారు. ‘ఎవరు అర్హులు? ఎవరు అనర్హులు? అన్నదానిపై మార్గదర్శకాలు ఉన్నందున మా కస్టమర్లలో అర్హులైనవారు ఎందరు? అన్నది మాకు తెలుస్తుంది.
ఆ లెక్కన ఇంకో రూ.70,000-80,000 కోట్ల మేర మా ఖాతాదారులకు ఈసీఎల్జీఎస్ స్కీమ్ రుణ ప్రయోజనాలు అందగలవు’ అన్నారు. కాగా, మంగళవారం ఈసీఎల్జీఎస్ 5.0కు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలతో ప్రభావితమవుతున్న దేశీయ వ్యాపార, పారిశ్రామిక రంగాలకు అండగా రూ.2.55 లక్షల కోట్ల అదనపు వర్కింగ్ క్యాపిటల్‌కు మోదీ సర్కార్ సై అన్నది. ఇందులో విమానయాన రంగానికి రూ.5,000 కోట్లను కేటాయించారు. మిగతాది సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లు, నాన్-ఎంఎస్ఎంఈ రుణగ్రహీతలకు అందనున్నది.
‘ఈసీఎల్జీఎస్ 5.0 సహాయక కార్యక్రమంపట్ల నేను సంతోషం వ్యక్తం చేస్తున్నాను. ఈ సాయాన్ని అందరూ తీసుకుంటారని కాదుగానీ.. రుణ సదుపాయమైతే అందుబాటులో ఉంటుంది’ అన్నారు. ఇక ఈ పథకం అమలుకున్న అడ్డంకులు వచ్చే 8-10 రోజుల్లో పరిష్కారం కావచ్చన్న ఆశాభావాన్ని శెట్టి వెలిబుచ్చారు. ఈ క్రమంలోనే బోర్డు అప్రూవల్స్, జన్ సమర్థ్ పోర్టల్ ద్వారా డిజిటల్ ప్రక్రియ అమలుకు లైన్‌క్లియర్ అవుతుందన్నారు. గతంలో కరోనా సమయంలో తెచ్చిన ఈసీఎల్జీఎస్ పథకాలూ లాభం చేకూర్చాయని శెట్టి గుర్తుచేశారు. అంతేగాక ఎంఎస్ఎంఈ రుణాల్లో సగటు ఎగవేతల రేటు కంటే ఈ పథకంలో డిఫాల్టర్ల రేటు తక్కువగా ఉందనీ చెప్పారు.
ఇదిలావుంటే బ్యాంకింగ్ వ్యవస్థలో ఈ పథకం ద్వారా 1.1 కోట్లకుపైగా కస్టమర్లు లబ్ధి పొందగలరని ఎస్బీఐ అంచనా. కాగా, ఈసారి రుణ కాలపరిమితిని నాలుగేండ్ల నుంచి ఐదేండ్లకు పొడిగించినట్టు కేంద్ర ఆర్థిక సేవల శాఖ కార్యదర్శి ఎం నాగరాజు పేర్కొన్నారు. అయితే విమానయాన రంగానికిచ్చే రుణాలకు ఏడేండ్ల టెన్యూర్ ఉంటుందన్నారు. అన్ని ఎంఎస్ఎంఈలకు ఈ స్కీమ్ కింద అర్హత ఉంటుందన్న ఆయన.. విద్యుత్తు, టెలికాం, చక్కెర, విద్యా రంగ సంస్థల వంటి కొన్ని నాన్-ఎంఎస్ఎంఈలకు అర్హత ఉండబోదన్నారు. పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం వీటిపై ఉండకపోవడమే కారణమన్నారు.