SBI | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన ఖాతాదారులకు అనునిత్యం కొత్త సేవలు అందుబాటులోకి తెస్తోంది. తాజాగా సీనియర్ సిటిజన్ల కోసం వాట్సాప్ సేవలు అందుబాటులోకి తెచ్చింది. సీనియర్ సిటిజన్లు ప్రతి నెలా పెన్షన్ స్లిప్ కోసం బ్యాంకు శాఖకు వెళ్లనవసరం లేకుండా ఇంటి నుంచే పొందేందుకు ఈ ఫెసిలిటీ కల్పిస్తోంది. దీంతో ఎటువంటి అవాంతరాలు లేకుండా, ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా వాట్సాప్ ద్వారా సీనియర్ సిటిజన్లు తమ పెన్షన్ స్లిప్ పొందే వెసులుబాటు లభిస్తుంది.
వాట్సాప్ ద్వారా పెన్షన్ స్లిప్ పొందాలనుకునే సీనియర్ సిటిజన్ ఖాతాదారులు మాత్రం తాము బ్యాంకులో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి + 91 9022690226 అనే మొబైల్ నంబర్‌కు వాట్సాప్ మెసేజ్ పంపితే చాలు.. వాట్సాప్ ద్వారా ఖాతాదారులు కేవలం పెన్షన్ స్లిప్ మాత్రమే కాక, మినీ స్టేట్మెంట్, బ్యాలెన్స్ ఎంక్వైరీ తదితర సేవలు కూడా పొందొచ్చు.
ఎస్బీఐ వాట్సాప్ సేవలు పొందగోరు ఖాతాదారులు తొలుత తమ పేర్లు నమోదు చేయించుకోవాలి. అలా చేయకపోతే సంబంధిత సీనియర్ సిటిజన్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ ఫోన్ నంబర్ నుంచి WAREG అని టైప్ చేసి.. స్పేస్ ఇవ్వాలి. అటుపై మీ ఖాతా నంబర్ టైప్ చేసి 72089 33148 మొబైల్ నంబర్ కు ఎస్సెమ్మెస్ పంపాలి. బ్యాంకులో మీ ఖాతాతోపాటు రిజిస్టర్ చేసిన మొబైల్ ఫోన్ నుంచే ఈ మెసేజ్ పంపాల్సి ఉంటుంది. కనుక ముందు మీ బ్యాంకు శాఖలో మీ మొబైల్ ఫోన్ నంబర్ అప్డేట్ చేసుకోవడం మరువొద్దు.