SBI 3 IN 1 | అతిపెద్ద కేంద్ర ప్రభుత్వ బ్యాంకు ఎస్బీఐ తన ఖాతాదారులకు కొత్త సేవలను అందుబాటులోకి తెస్తున్నది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెడుతున్న మదుపర్ల సంఖ్య రోజురోజుకి పెరుగుతున్నది. పలువురు డీమాట్, ట్రేడింగ్ఖాతాలను తెరవడానికి ప్రైవేట్ బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. ఈ తరుణంలో మదుపర్ల కోసం ఎస్బీఐ త్రీ ఇన్ వన్ ఖాతా ప్రారంభిస్తున్నది. ఇందులో సేవింగ్స్, డీమాట్, ట్రేడింగ్ ఖాతాలు ఉంటాయి.
త్రీ వన్ వన్ ఖాతాదారులు 25 శాతం మార్జిన్‌తో ట్రేడింగ్ చేయవచ్చు. దీన్ని ఈ-మార్జిన్ ఫెసిలిటీగా వ్యవహరిస్తారు. మార్జిన్ స్టాక్స్ రూపంలో గానీ, క్యాష్ రూపంలో గానీ ఉంటుంది. ఖాతాదారులు నచ్చిన అంశాన్ని ఎంపిక చేసుకోవచ్చు. ట్రేడింగ్ స్టాక్స్ డెలివరీగా మార్చు కోవచ్చు. వీటితోపాటు సేవింగ్స్ ఖాతాతోపాటు అన్ని ప్రయోజనాలు వర్తిస్తాయి.
ఖాతాదారుల సౌకర్యార్థం ఎస్బీఐ నిరంతరం కొత్త సేవలను అందుబాటులోకి తెస్తున్నది. ఇప్పటికే కస్టమర్లకు జీరో బ్యాలెన్స్, జన్‌ధన్, సేవింగ్స్, కరెంటు ఇలా పలు రకాల ఖాతాలు అందిస్తున్న విషయం తెలిసిందే. ఎస్బీఐ త్రీ ఇన్ వన్ ఫీచర్లతో ప్రారంభించే సేవింగ్స్ ఖాతా కోసం పాన్ కార్డు లేదా ఫామ్ 60, ఫొటోలు, పాస్‌పోర్ట్, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీ, ఉపాధి హామీ కార్డుల్లో ఒకటి సమర్పించాల్సి ఉంటుంది. డీమాట్ ట్రేడింగ్ ఖాతా కోసం పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, పాన్‌కార్డు, చెక్/ తాజా బ్యాంక్ స్టేట్మెంట్ సమర్పించాలి.
ఖాతాదారులు ఎస్బీఐ సెక్యూరిటీస్ వెబ్ సైట్‌కి వెళ్లి ట్రేడింగ్ అకౌంట్లో లాగిన్ కావాలి. ఆర్డర్ ప్లేస్మెంట్ మెనూలోకి వెళ్లాలి. ప్రొడక్ట్ టైప్ని ఈ-మార్జిన్‌గా ఎంపిక చేసుకుని ఆర్డర్ ప్లేస్ చేయాల్సి ఉంటుంది.