మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 10(నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పోలింగ్‌కు కొద్ది గంటల ముందే అనూహ్యంగా బీజేపీ వార్డు అభ్యర్థి ఎరుకలి మహదేవప్ప(45) బలవన్మరణానికి పాల్పడటం తీవ్ర కలకలం రేపింది. మంగళవారం నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీలో ఈ ఘటన జరిగింది. ‘ప్రచారం నుంచి తప్పుకో.. లేకపోతే నీ అంతుచూస్తా’మని మంత్రి వాకిటి శ్రీహరి బెదిరించడం వల్లే మహదేవప్ప ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి బంధువులు ఆరోపించారు. కొద్దిరోజుల నుంచి కాంగ్రెస్ నాయకులు కూ డా ప్రచారం నుంచి తప్పుకోవాలంటూ బెదిరిస్తున్నారని.. తాను గెలిచినా బతకనివ్వరని చెప్పిన కొన్ని గంటల్లోనే ఇలా జరిగిందంటూ మృతుడి భార్య సత్యమ్మ చెబుతూ కన్నీటిపర్యంతమైంది.
పోలీసులు మాత్రం ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నట్టు పంచనామాపై భార్యతో బలవంతంగా సంతకం తీసుకోవడం, వెంటనే ఎఫ్ఐఆర్ చేయడం, మంత్రిని తప్పించేందుకేననే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వనపర్తి జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 2వ వార్డు అభ్యర్థి దివ్యాంగుడైన జయరాం నాయక్‌ను కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు బైక్‌తో ఢీకొట్టి గాయపర్చగా తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు. ఈ రెండు ఘటనలు ముఖ్యమంత్రి సొంత జిల్లాలో చోటుచేసుకోవడం తీవ్ర సంచలనం రేపింది. ఇటీవల కొడంగల్ నియోజకవర్గం కోస్గిలో బీఆర్ఎస్ వార్డ్ సభ్యుడిని బలవంతంగా ఎత్తుకెళ్లి సీఎం సోదరుడు కాంగ్రెస్ కండువా కప్పి పార్టీ మారిన ఘటన మరువకముందే.. మక్తల్‌లో బీజేపీ అభ్యర్థి ఆత్మహత్య, ఆత్మకూరులో బీఆర్ఎస్ అభ్యర్థిని బైక్‌తో ఢీకొట్టడం చూస్తుంటే కాంగ్రెస్ నేతలు పక్కా స్కెచ్‌తో విపక్ష అభ్యర్థులను టార్గెట్ చేస్తున్నారని స్పష్టమవుతున్నది. బీజేపీ వార్డు అభ్యర్థి మృతి కారణంగా ఈసీ ఆ వార్డు ఎన్నికను వాయిదా వేసింది.
మక్తల్‌లో 6వ వార్డు(ఎస్టీ రిజర్వ్డ్)లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఎరుకలి మహదేవప్పది.. మున్సిపల్ విలీన గ్రామం చందాపూర్. ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు ఓటర్లను కలుస్తూ వచ్చాడు. అయితే రెండు, మూడు రోజుల నుంచి కాంగ్రెస్ నాయకులు అతని వెంటపడి బెదిరిస్తున్నారని, కుటుంబ సభ్యులు తెలిపారు. అర్ధరాత్రి ఇంటికి వస్తుండగా ఒక ఫోన్ కాల్ వచ్చిందని.. ఆ ఫోన్ కాల్లో బెదిరించారని, దీంతో మనస్తాపం చెంది ఇంటికి వచ్చి భార్యతో ‘నేను గెలిచినా నన్ను బతకనివ్వరు’ అని చెప్పి లోపలికి వెళ్లి ఉరేసుకున్నాడు. భార్య ఉదయం లేచి చూడగానే విగతజీవిగా పడి ఉన్నాడు.
మహదేవప్పకు వచ్చిన ఫోన్ కాల్ మంత్రి శ్రీహరిదేనని, ఆయన బెదిరించడం వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని మహదేవప్ప సన్నిహితులు మీడియాతో చెప్పారు. మక్తల్ సీఐ హు టాహుటిన ఘటనా స్థలికి వెళ్లి అభ్యర్థి వాడిన ఫోన్‌ను స్వాధీనం చేసుకోవడం ఈ అనుమానాలకు బలం చేకూర్చుతున్నది. ఆ ఫోన్లో డాటా డిలీట్ చేసేందుకే స్వాధీనం చేసుకున్న ట్టు తెలుస్తున్నది. ఇదంతా మంత్రిని కా పాడే ప్రయత్నమేననే ఆరోపణలు వస్తున్నాయి.

మృతుడి ఇంటికి మంగళవారం ఉదయం నారాయణపేట డీఎస్పీ లింగయ్య, మక్తల్ సీఐ రాంలాల్ హడావిడిగా వచ్చారు. మృతుడి భార్య కనీస విచారణ చేయకుండా పోలీస్‌స్టేషన్‌లో రాసుకొచ్చిన స్క్రిప్ట్ తీసుకొచ్చి మహదేవప్ప సత్యమ్మతో బలవంతంగా సంతకాలు తీసుకున్నట్టు తెలిసింది. ఒకటి ఫిర్యాదు కాపీ.. మరొకటి పంచనామా కాపీగా భావిస్తున్నారు. అనంతరం పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. ఎవరి బలవంతం లేదని, ఆర్థిక ఇబ్బందులు, ఇతర కారణాల వల్లనే గుండెపోటు రావడంతో ఆత్మహత్య చేసుకున్నట్టు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ రామచంద్రరావు, ఎంపీ డీకే అ రు ణ, పార్టీ నాయకులు నాగురావు, కొండయ్య, బాలరాజ్ తదితరులు ఎఫ్ఐఆర్ను మార్చి.. వాస్తవాలతో ఫిర్యాదు తీసుకోవాలని పట్టుబట్టారు. దీంతో చేసేది లేక కూతురు అనూషతో మళ్లీ ఫిర్యాదు రాయించారు.
బీజేపీ అభ్యర్థి ఆత్మహత్యపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి, కాంగ్రెస్ నేతలపై కేసులు నమోదు చేయాలని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంగళవారం మహదేవప్ప ఇంటికి వెళ్లి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి అండ చూసుకొని కాంగ్రెస్ నాయకులు రెచ్చిపోతున్నారని, గిరిజనుడి చావుకు కారణమయ్యారని మండిపడ్డారు.
బీజేపీ అభ్యర్థి మహదేవప్పది ఆత్మహత్య కాదని.. ముమ్మాటికీ హత్యేనని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు ఆరోపించారు. మంత్రి శ్రీహరి, మరికొందరు కాంగ్రెస్ నాయకుల ఒత్తిళ్లే కారణమని పేర్కొన్నారు. మక్తల్ దవాఖాన వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ఒకవైపు సీఎం సోదరుడు అభ్యర్థులను ఎత్తుకెళ్లి కాంగ్రెస్ కండువా కప్పుతుంటే.. మరోవైపు మంత్రి, కాంగ్రెస్ నేతలు బెదిరిస్తున్నారని.. ఇదెక్కడి ప్రజాస్వామ్యం అని ధ్వజమెత్తారు. ఇది రేవంత్ ప్రభుత్వమా? రాబందుల ప్రభుత్వమా? అని మండిపడ్డారు. చట్టపరంగా పోలీసులు సరైన చర్యలు తీసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చెబితే ఎఫ్ఐఆర్ మారుస్తారా? మంత్రి చెబితే మారుస్తారా? అంటూ విరుచుకుపడ్డారు. డీఎస్పీ, సీఐలను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ పాలనలో ఎస్టీలకు భద్రత కరువైందని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జా టోత్ హుస్సేన్ నాయక్ మండిపడ్డారు. మంగళవారం మహదేవప్ప కుటుంబాన్ని ఆయన పరామర్శించి, ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. నిందితులకు శిక్ష ప డేలా చర్యలు తీసుకుంటామని స్పష్టంచేశారు. మహదేవప్ప మొబైల్ ఫోన్‌ను పోలీసులు స్వా ధీనం చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. అరాచకాలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పెంచి పోషిస్తున్నదని ధ్వజమెత్తారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ): మక్తల్ మున్సిపాలిటీలో ఆరో వార్డు అభ్యర్థిగా పోటీలో నిలిచిన మహదేవప్ప మరణానికి కారకులైన మంత్రి శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ జాతీయ మానవ హకుల కమిషన్‌లో న్యాయవాది కారుపోతుల రేవంత్‌గౌడ్ మంగళవారం ఫిర్యాదు చేశారు. పోలింగ్‌కు ఒకరోజు ముందు అభ్యర్థి చనిపోవడంపై అనుమానాలు ఉన్నట్టు పేర్కొన్నా రు. నామినేషన్ వేసినప్పటి నుంచి అధికా ర పార్టీ పోటీ నుంచి తప్పుకోవాలని భయభ్రాంతులకు గురిచేసినట్టు తెలుస్తున్నదని పేర్కొన్నారు. ఈ ఘటనపైబాధ్యులపై చర్యలు తీసుకొని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు.