హైదరాబాద్: క్రెడిట్ కార్డ్ (Credit Cards) వినియోగదారులకు ముఖ్య గమనిక. క్రెడిట్ కార్డు నిబంధనల్లో కొన్ని మార్పులు చోటుచేసుకున్నాయి. రివార్డు పాయింట్ల వ్యాలిడిటీ, ఆన్లైన్లో బిల్లుల చెల్టింపులు, ఫ్యూయెల్ సర్‌చార్జీల విషయంలో కోతలు, వాతలు విధించాయి. ఈ కొత్త రూల్స్ శుక్రవారం నుంచే అమల్లోకి వచ్చాయి. దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ, ప్రైవేటురంగ బ్యాంకులైన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఐసీఐసీఐ తమ క్రెడిట్ కార్డ్ నిబంధనల్లో మార్పులు చేశారు. మీరు కూడా ఈ బ్యాంకుల క్రెడిట్ కార్డులు వాడుతున్నారా.. అయితే ఈ మార్పుల గురించి తెలుసుకొని జాగ్రత్తగా వాడుకోండి.
రివార్డ్ పాయింట్ల వ్యాలిడిటీని ఎస్బీఐ మార్చింది. దీంతో రివార్డ్ పాయింట్లు పరిమిత సమయం వరకు మాత్రమే చెల్లుబాటు అవుతాయి. అందువల్ల నిర్ణీత సమయంలోపే వాటిని వాడుకోవాల్సి ఉంటుంది. ఇక క్రెడిట్ కార్డ్‌తో ఈఎంఐ ద్వారా కొనుగోళ్లు చేస్తే, దానిపై కొన్ని అదనపు చార్జీలు వసూలు చేయనుంది. ఈ నేపథ్యంలో పెద్దమొత్తంలో కొనుగోలు చేసేటప్పుడు సంబంధిత చార్జీల గురించి కార్డుహోల్డర్స్ తెలుసుకోవడం మంచిది.
ఇక బిల్లు చెల్లింపుల విషయానికి వస్తే.. ఆన్లైన్ బిల్లు చెల్లింపులు, ఆటో డెబిట్ లావాదేవీలు మొదలైన వాటిపై అదనపు చార్జీలు వసూలు చేయనుంది.
ఐసీఐసీఐ క్రెడిట్ కార్డ్..
ప్రైవేటు రంగంలో అతిపెద్ద బ్యాంక్ అయిన ఐసీఐసీఐ కూడా క్రెడిట్ కార్డు నిబంధనలను మార్చింది. ఇందులో భాగంగా క్రెడిట్ కార్డ్‌లపై ఇంధన సర్‌చార్జీలపై ఇచ్చే మినహాయింపుల్లో మార్పులు చేసింది. కొన్ని కార్డ్‌లలో ఈ సదుపాయాన్ని పూర్తిగా తొలగించగా మరికొన్ని కార్డ్‌లలో పరిమితి ఆధారంగా అందుబాటులో ఉంటుంది.
రివార్డ్ పాయింట్ల రిడెంప్షన్ ప్రక్రియను కూడా మార్చింది. నిర్దిష్ట కేటగిరీలలో రివార్డ్ పాయింట్ల రీడెంప్షన్ మునుపటి కంటే భిన్నంగా ఉంటుంది. వాటిలో కోన్ని పరిమితులు ఉండవచ్చు. ఇక ఈఎంఐలో చేసిన కొనుగోళ్లపై వడ్డీ రేట్లలో మార్పులు చోటుచేసుకున్నాయి. కార్డు రకం, లావాదేవీని బట్టి కొత్త వడ్డీ రేట్లు మారవచ్చని వెల్లడించింది.