న్యూఢిల్లీ, మార్చి 11: బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ఫిక్స్డ్ డిపాజిట్ దారులకు శుభవార్తను అందించింది. ఈ నెల 10 నుంచి అమలులోకి వచ్చేలా రూ.2 కోట్ల కంటే అధిక బల్క్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేటును 20 బేసిస్ పాయింట్ల నుంచి 40 బేసిస్ పాయింట్ల వరకు పెంచింది. బ్యాంక్ వెబ్సైట్ సమాచారం మేరకు ఈ విషయం వెల్లడైంది. 211 రోజుల కంటే అధిక డిపాజిట్లకు మాత్రమే ఈ వడ్డీరేటు వర్తించనున్నదని తెలిపింది. ఇలాంటి డిపాజిట్లపై 3.30 శాతం చొప్పున వడ్డీ లభించనున్నది. వడ్డీ పెరగకముందు ఇది 3.10 శాతంగా ఉన్నది. అలాగే సీనియర్ సిటిజన్లకు 3.80 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది బ్యాంక్. అలాగే ఏడాది నుంచి 10 ఏండ్లలోపు డిపాజిట్లపై వడ్డీరేటును 40 బేసిస్ పాయింట్లు సవరించింది. దీంతో వడ్డీరేటు 3.10 శాతం నుంచి 3.60 శాతానికి చేరింది. సీనియర్ సిటిజన్లకు 4.10 శాతం లభించనున్నది. పెంచిన వడ్డీరేటు కొత్త డిపాజిట్లు, రెన్యూవల్స్ డిపాజిట్లకు వర్తించనున్నది. వీటితోపాటు రెండేండ్ల నుంచి మూడేండ్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు సవరించింది. దీంతో వడ్డీరేటు 5.20 శాతానికి చేరుకున్నది. అలాగే 3-5 ఏండ్లలోపు డిపాజిట్లపై వడ్డీరేటును 15 బేసిస్ పాయింట్లు సవరించడంతో రేటు 5.45 శాతానికి ఎగబాకింది. 5-10 ఏండ్లలోపు డిపాజిట్లపై వడ్డీరేటును కూడా 10 బేసిస్ పాయింట్లు సవరించడంతో రేటు 5.50 శాతానికి చేరుకున్నది.