SBI Alert | భారతీయ స్టేట్ బ్యాంకులో మీకు ఖాతా ఉందా.. మీరు ఎక్కువగా డబ్బు ఇతరులకు ట్రాన్స్ఫర్ చేస్తున్నారా? అయితే, వచ్చేనెల ఒకటో తేదీ నుంచి ఇతరులకు నగదు ట్రాన్స్ఫర్ పై కొత్త శ్లాబ్‌లకు అనుగుణంగా కొత్త చార్జీలు అమల్లోకి తేనున్నది. అవేమిటో ఓ లుక్కేద్దాం..
ఇమ్మీడియట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) లావాదేవీల పరిమితిని ఎస్బీఐ పెంచేసింది. గతంలో రూ.2 లక్షలు ఉన్న పరిమితిని ఇప్పుడు రూ.5 లక్షలకు పెంచేసింది. అందులోనూ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్ చేస్తే చార్జీలు ఉండవు. ఆఫ్‌లైన్‌లో ట్రాన్స్ఫర్ చేస్తే మాత్రం చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ఆఫ్‌లైన్‌లో ట్రాన్స్ఫర్ చేస్తే గరిష్ఠంగా రూ.20తోపాటు జీఎస్టీ కూడా చెల్లించాలి.
రూ.1000 వరకు ఎస్బీఐ ఖాతాదారుడు ఐఎంపీఎస్ ద్వారా ఆఫ్‌లైన్‌లో ఉచితంగా ట్రాన్స్ఫర్ చేయొచ్చు. రూ.10 వేల వరకు రూ.2 సర్వీస్ చార్జీతోపాటు జీఎస్టీ చెల్లించాలి. రూ.లక్ష వరకు రూ. 4 సర్వీస్ చార్జీ ప్లస్ జీఎస్టీ, రూ.2 లక్షల వరకు రూ.12 సర్వీస్ చార్జీ ప్లస్ జీఎస్టీ, రూ.5 లక్షల వరకు రూ.20 సర్వీస్ చార్జీతోపాటు జీఎస్టీ చెల్లించాలి.
ఎస్బీఐ ఖాతాదారులు ఐఎంపీఎస్తోపాటు నెప్ట్, ఆర్టీజీఎస్ ద్వారా కూడా డబ్బు ట్రాన్స్ఫర్ చేయొచ్చు. తక్షణం నగదు బదిలీకి ఐఎంపీఎస్ సర్వీసు ఉకరిస్తుంది. నెఫ్ట్ ద్వారా ట్రాన్స్ఫర్ చేస్తే బ్యాచ్‌ల వారీగా ట్రాన్సాక్షన్ సెటిల్మెంట్ అవుతుంది. ఆర్టీజీఎస్ సర్వీస్ ద్వారా భారీగా డబ్బు పంపవచ్చు.
నెఫ్ట్ ద్వారా కూడా ఆన్లైన్లో అంటే ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ ద్వారా రూ.2 లక్షల వరకు ట్రాన్స్ఫర్ చేసినా చార్జీలు ఉండవు. ఆఫ్‌లైన్‌లో రూ.10 వేల వరకు రూ.2 ప్లస్ జీఎస్టీ, రూ.లక్ష వరకు రూ.4 ప్లస్ జీఎస్టీ, రూ.2 లక్షల వరకు రూ.12 ప్లస్ జీఎస్టీ, రూ.2 లక్షలు దాటితే రూ.20 ప్లస్ జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది.