CS Shetty | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25: లక్ష కోట్ల రూపాయల లాభాన్ని సాధించిన తొలి భారతీయ ఆర్థిక సంస్థగా ఎదగాలన్నదే ఎస్బీఐ లక్ష్యమని, ఆ దిశగా వెళ్తున్నామని ఆ బ్యాంక్ నూతన చైర్మన్ సీఎస్ శెట్టి పీటీఐకిచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. వచ్చే 3 నుంచి 5 ఏండ్లలో దీన్ని సాధిస్తామన్న విశ్వాసాన్ని ఆయన కనబర్చారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో ఈ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టాండలోన్ నికర లాభం రూ.61,077 కోట్లుగా ఉన్నది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం (2022-23)తో పోల్చితే 21.59 శాతం ఎగిసింది.
ఈ క్రమంలోనే 2028-29కల్లా లక్ష కోట్ల రూపాయల మైలురాయిని అధిగమిస్తామన్న ధీమాను వెలిబుచ్చారు. ‘మాకు ఆ సామర్థ్యం ఉన్నది. తప్పకుండా దాన్ని సాధించి దేశంలో ఈ ఘనతను అందుకున్న తొలి ఆర్థిక సంస్థగా ఎస్బీఐని నిలబెడతాం’ అని వచ్చే 3-5 ఏండ్లలో లక్ష కోట్ల రూపాయల లాభాన్ని సాధిస్తారా? అన్న ప్రశ్నకు శెట్టి బదులిచ్చారు. లాభాలు, మార్కెట్ క్యాపిటలైజేషన్ మొదలగునవి ఎస్బీఐకి చాలాచాలా ప్రధానమైనవని స్పష్టం చేశారు. కార్పొరేట్ రుణాల డిమాండ్‌పై మాట్లాడుతూ.. ఇప్పటికే బ్యాంక్ రుణాలు రూ.4 లక్షల కోట్లపైనే ఉంటాయని, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ద్వితీయార్ధంలో ఇవి మరింత పెరుగుతాయన్న ఆశాభావాన్ని వెలిబుచ్చారు.