న్యూఢిల్లీ, జనవరి 26: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.549 కోట్ల నికర లాభా న్ని గడించింది ఎస్బీఐ కార్డ్స్ అండ్ పేమెంట్ సర్వీసెస్ లిమిటెడ్. క్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో నమోదైన రూ.509 కోట్ల లాభంతో పోలిస్తే 8 శాతం వృద్ధిని నమోదు చేసుకున్నది. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం రూ.3,656 కోట్ల నుంచి రూ. 4,742 కోట్లకు ఎగబాకినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. నిర్వహణ ఖర్చులు కూడా 23 శాతం అధికమై రూ.2,426 కోట్లకు చేరుకున్నాయి. కంపెనీ స్థూల నిరర్థక ఆస్తుల విలువ 2.22 శాతం నుంచి 2.64 శాతానికి చేరుకోగా, నికర ఎన్పీఏ 0.80 శాతం నుంచి 0.96 శాతానికి చేరుకున్నట్లు వెల్లడించింది. మొండి బకాయిలు రూ. 533 కోట్ల నుంచి రూ.883 కోట్లకు చేరుకున్నాయి. అలాగే క్యాపిటల్ అడెక్వసీ రేషియో 18.4 శాతం నుంచి 23.1 శాతానికి చేరుకున్నట్లు పేర్కొంది.