SBI | న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) రుణ గ్రహీతలకు శుభవార్తను అందించింది. రిజర్వు బ్యాంక్ రెపో రేట్లను పావు శాతం తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా ఎస్బీఐ కూడా రుణాలపై వడ్డీరేటును అంతేస్థాయిలో కోత పెట్టింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్)ని 25 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రుణరేటు 8.25 శాతానికి దిగొచ్చింది. దీంతోపాటు ఎక్స్టర్నల్ బెంచ్మార్క్ బేస్డ్ లెండింగ్ రేటు(ఈబీఎల్ఆర్)ని అంతే స్థాయిలో తగ్గించడంతో రేటు 8.65 శాతానికి దించింది. తగ్గించిన రేట్లు ఈ నెల 15 నుంచి అమలులోకి రానున్నట్టు పేర్కొంది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పటికే రుణాలు తీసుకున్నవారితో పాటు కొత్తగా రుణాలు తీసుకోనున్నవారికి ఆర్థిక ప్రయోజనాలు కలుగనున్నాయి. పడిపోతున్న దేశ ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడానికి రిజర్వుబ్యాంక్ ఈఏడాదిలో వరుసగా రెండోసారి వడ్డీరేటును పావు శాతం తగ్గించిన విషయం తెలిసిందే.
ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా..
ఫిక్స్డ్ డిపాజిట్లపై కూడా వడ్డీరేటును బ్యాంక్ 25 బేసిస్ పాయింట్ల వరకు కోత పెట్టింది. ఈ నెల 15 నుంచి అమలులోకి వచ్చేలా ఏడాది నుంచి రెండేండ్లలోపు డిపాజిట్లపై వడ్డీరేటును 10 బేసిస్ పాయింట్లు తగ్గించడంతో రేటు 6.8 శాతం నుంచి 6.7 శాతానికి దిగింది. రెండేండ్ల నుంచి మూడేండ్ల లోపు కాలపరిమితి కలిగిన డిపాజిట్లపై వడ్డీని కూడా 6.9 శాతానికి తగ్గించింది. అంతకుముందు ఇది 7 శాతంగా ఉన్నది. మరోవైపు, 444 రోజుల కాలపరిమితితో కూడిన ప్రత్యేక డిపాజిట్ స్కీం అమృత్ వృష్టి స్కీంను మళ్లీ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కీంపై 7.05 శాతం వార్షిక వడ్డీని ఆఫర్ చేస్తున్నది.
బీవోఎం సైతం..
బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) కూడా కీలక వడ్డీరేట్లను పావు శాతం తగ్గించింది. రెపో లింక్డ్ లెండింగ్ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్)ని పావు శాతం తగ్గించడంతో రుణాలపై వడ్డీరేటు 9.05 శాతం నుంచి 8.80 శాతానికి దిగొచ్చింది. మరో ప్రభుత్వరంగ సంస్థ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ కూడా బెంచ్మార్క్ లెండింగ్ రేటును 25 బేసిస్ పాయింట్లు తగ్గించింది. ఆర్ఎల్ఎల్ఆర్తో అనుసంధానమైన రుణాలపై వడ్డీరేటు 9.10 శాతం నుంచి 8.85 శాతానికి దిగిరానున్నాయి.