SBI | ముంబై, ఆగస్టు 13: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐ.. రిటైల్ కస్టమర్ల ఇమ్మీడియెట్ పేమెంట్ సర్వీస్ (ఐఎంపీఎస్) లావాదేవీ చార్జీలను సవరిస్తున్నట్టు ప్రకటించింది. ఆన్లైన్లో, బ్యాంక్ శాఖల్లో జరిపే లావాదేవీలనుబట్టి చార్జీలు వేర్వేరుగా ఉంటాయి. దీంతో కొత్తగా చార్జీలను వేసినట్టు తెలుస్తున్నది. ఇక పెరిగిన చార్జీలు ఈ నెల 15 (శుక్రవారం) నుంచి అమల్లోకి వస్తాయి. అయితే ఆన్లైన్ వినియోగదారులకు రూ.25 వేలదాకా ఐఎంపీఎస్ లావాదేవీలకు ఎలాంటి చార్జీలు ఉండవు. ఆపైన మాత్రం చార్జీలుంటాయి. ఐఎంపీఎస్ బ్యాంక్ కస్టమర్లకు నిరంతరం అందుబాటులో ఉండే సేవ.
రూ.25 వేల నుంచి లక్ష రూపాయల వరకు రూ.2 చార్జీ పడుతుంది. లక్ష రూపాయలు-రూ.2 లక్షలకు చార్జీ రూ.6గా ఉంటుంది. రూ.2 లక్షల నుంచి 5 లక్షల వరకు రూ.10 చార్జీ వర్తిస్తుంది. వీటికి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) అదనం. ప్రస్తుతం ఈ లావాదేవీలన్నీ ఉచితంగానే జరుగుతున్నాయి. కాగా, ఐఎంపీఎస్పై లావాదేవీ పరిమితి రూ.5 లక్షలే (ఎస్ఎంఎస్, ,ఐవీఆర్ మినహా)నన్న విషయం తెలిసిందే. అలాగే ఎస్బీఐలో వేతన ఖాతాదారులకు ఆన్లైన్ ఐఎంపీఎస్ బదిలీలపై ఎలాంటి చార్జీలు పడవు.
సాలరీ ప్యాకేజీ అకౌంట్లకు ఆన్లైన్ ఐఎంపీఎస్ ఫ్రీ. రక్షణ, పారా మిలిటరీ, ఇండియన్ కోస్ట్ గార్డ్, కేంద్ర ప్రభుత్వ, పోలీస్, రైల్వే శాఖల ఉద్యోగులకు ఎస్బీఐలో వేతన ఖాతాలుంటే వారంతా ఉచితంగానే ఐఎంపీఎస్ను వినియోగించుకోవచ్చు. శౌర్య కుటుంబ పెన్షన్ ఖాతాదారులకూ ఈ వెసులుబాటు ఉంటుంది. ఇక కార్పొరేట్ సాలరీ ప్యాకేజీ, రాష్ట్ర ప్రభుత్వ సాలరీ ప్యాకేజీ, స్టార్టప్ సాలరీ ప్యాకేజీ వంటి వేతన ఖాతాదారులకూ చార్జీల్లేవు. ఫ్యామిలీ సేవింగ్స్ అకౌంట్-ఎస్బీఐ రిష్తేకూ ఇంతేనని బ్యాంక్ తెలిపింది.
ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్లో ఐఎంపీఎస్ చార్జీల విషయానికొస్తే.. రూ.1,000లోపు లావాదేవీలపై చార్జీల్లేవు. రూ.1,000-10,000 లావాదేవీలపై రూ.3, రూ.10 వేలు-25 వేలకు రూ.5, రూ.25 వేలు-లక్ష రూపాయల లావాదేవీలకు రూ.8, లక్ష రూపాయలు-రూ.2 లక్షలకు రూ.15, రూ.2 లక్షలు-5 లక్షలకు రూ.20 చార్జీ ఉంటుంది. వీటిపై జీఎస్టీ అదనం.
ప్రభుత్వ రంగ బ్యాంకైన పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్బీ) ఐఎంపీఎస్ చార్జీలను పరిశీలిస్తే.. రూ.1,000లోపు లావాదేవీలకు చార్జీలుండవు. ఆపై లక్ష రూపాయలదాకా చార్జీ రూ.6గా ఉన్నది. బ్యాంక్ శాఖల్లో కాకుండా ఆన్లైన్లో ఈ లావాదేవీ జరిగితే రూ.5గా ఉన్నది. లక్ష రూపాయలపైన లావాదేవీకి రూ.12 చార్జీ ఉంటుంది. ఆన్లైన్లో రూ.10గా ఉన్నది. వీటికి జీఎస్టీ అదనం.
ఎస్బీఐ తమ బ్యాంక్ శాఖల ద్వారా జరిగే ఏ సర్వీస్ చార్జీలనూ మార్చలేదు. కనిష్ఠ చార్జీ రూ.2 (జీఎస్టీ అదనం)గా ఉన్నది. గరిష్ఠ చార్జీ రూ.20 (జీఎస్టీ అదనం). ప్రస్తుతానికైతే ఆన్లైన్ ద్వారా జరిగే ఐఎంపీఎస్ లావాదేవీలపైనే చార్జీలను వేసింది.