న్యూఢిల్లీ, జనవరి 3: డిపాజిట్‌దారులను ఆకర్షించేందుకు ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) రెండు సరికొత్త డిపాజిట్ పథకాలను పరిచయం చేసింది. హర్ ఘర్ లఖ్పతి, ప్యాట్రాన్స్ పేరిట వీటిని ప్రారంభించినట్టు శుక్రవారం బ్యాంక్ ప్రకటించింది. ఖాతాదారుల ఆర్థిక అవసరాలు ఇంకా సౌకర్యవంతంగా తీరేలా, మరింత విలువతో ఈ నయా స్కీములను రూపొందించింది.
ఇదో ప్రీ-కాలిక్యులేటెడ్ రికరింగ్ డిపాజిట్ పథకం. లక్ష రూపాయలు, ఆపై మొత్తాలను కస్టమర్లకు అందించేలా ఈ స్కీమును డిజైన్ చేసినట్టు ఓ ప్రకటనలో ఎస్బీఐ స్పష్టం చేసింది. ఈ డిపాజిట్‌తో కస్టమర్ల ఆర్థిక లక్ష్యాలు సులభంగా తీరుతాయని, ఆర్థిక ప్రణాళిక-పొదుపు మరింత ప్రభావవంతంగా ఉంటాయన్నది. ఎఫ్డీపై అమల్లో ఉన్న వడ్డీరేట్లే దీనికీ ఉంటాయి. ప్రస్తుతం ఏడాదికిపైగా కాలపరిమితి కలిగిన ఎఫ్డీలపై 6.80 శాతం, రెండేండ్లకుపైగా కాలపరిమితి ఎఫ్డీపై 7 శాతం, 3-5 ఏండ్ల ఎఫ్డీలపై 6.75 శాతం, 5-10 ఏండ్ల ఎఫ్డీలపై 6.5 శాతం వడ్డీరేట్లున్నాయి. రికరింగ్ డిపాజిట్ల కనీస కాలపరిమితి సంవత్సరం. గరిష్ఠం 10 ఏండ్లు.
80 ఏండ్లు, ఆపై వయసు కలిగినవారి కోసం ఈ పథకాన్ని ఎస్బీఐ ప్రత్యేకంగా తీసుకొచ్చింది. ఇందులో సీనియర్ సిటిజన్లకు మరింత వడ్డీరేటు లభిస్తుంది. అదనంగా మరో 10 బేసిస్ పాయింట్ల వడ్డీరేటు వర్తిస్తుంది. ప్రస్తుత, కొత్త టర్మ్ డిపాజిట్ కస్టమర్లకు ఈ పథకం అందుబాటులో ఉంటుందని ఎస్బీఐ తెలియజేసింది. ముఖ్యంగా ఎప్పట్నుంచో బ్యాంక్‌తో అనుబంధాన్ని కొనసాగిస్తున్న వృద్ధులకు లాభం చేకూర్చాలనే దీన్ని రూపొందించామని పేర్కొన్నది. కాగా, డిపాజిట్లలో ఎస్బీఐ మార్కెట్ వాటా 23 శాతంగా ఉన్నది. ఈ నేపథ్యంలో తాజాగా ప్రకటించిన ఈ రెండు డిపాజిట్లతో మార్కెట్లో మరింత వాటాను అందిపుచ్చుకుంటామన్న ఆశాభావాన్ని ఈ సందర్భంగా బ్యాంక్ చైర్మన్ సీఎస్ శెట్టి వ్యక్తం చేశారు. ఇదిలావుంటే ఎన్ఆర్ఈ, ఎన్ఆర్వో ఖాతాలను తెరిచేందుకు ఎన్నారైల కోసం ఓ ట్యాబ్ ఆధారిత ఎండ్-టు-ఎండ్ డిజిటల్ ఆన్-బోర్డింగ్ ప్రక్రియను ఎస్బీఐ ప్రకటించింది. దేశంలోని అన్ని ఎస్బీఐ శాఖల్లో, ఎంపిక చేసిన కొన్ని విదేశీ కార్యాలయాల్లో ఇది అందుబాటులో ఉంటుందని వివరించింది.