SBI Amrit Kalash | దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) తన స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ ‘అమృత్ కలశ్’ గడువు మరోదఫా పొడిగించింది. 400 రోజుల గడువుతో కూడిన ఈ పథకం గడువు ఈ నెల 15తోనే ముగియాల్సి ఉంది. డిపాజిటర్ల నుంచి స్పందన లభించడంతో ఈ ఏడాది చివరి వరకూ గడువు పొడిగించింది. ఎస్బీఐ వెబ్సైట్ ప్రకారం సాధారణ పౌరులకు 7.1 శాతం, సీనియర్ సిటిజన్లకు 7.6 శాతం వడ్డీరేటు వర్తిస్తుంది. అమృత్ కలశ్ స్పెషల్ ఫిక్స్డ్ డిపాజిట్ స్కీమ్ కింద మదుపు చేయడానికి 2023 డిసెంబర్ 31 చివరి తేదీ.
ఎన్నారై రూపీ టర్మ్ డిపాజిట్లతోపాటు డొమెస్టిక్ రిటైల్ టర్మ్ డిపాజిట్లు.. అంటే ఎన్నారైలతోపాటు సాధారణ పౌరులు డిపాజిట్ చేయొచ్చు. మెచ్యూరిటీ తేదీ దాటిన తర్వాత టర్మ్ డిపాజిట్లపై వడ్డీ చెల్లిస్తారు. కస్టమర్ ఖాతాలో వడ్డీ ఆదాయం డిపాజిట్ చేస్తారు.
మిగతా ఫిక్స్డ్ డిపాజిట్లపై మూడు నుంచి ఏడు శాతం వడ్డీరేట్లు వర్తిస్తాయి. డిపాజిటర్లు రూ.2 కోట్ల లోపు డిపాజిట్లు చేసుకోవచ్చు. సీనియర్ సిటిజన్లకు 3.50 నుంచి 7.50 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది.