నేడు మనం చేసే పొదుపు, పెట్టుబడులే రేపు మన భవిష్యత్తుకు రక్షణనిస్తాయి. దీర్ఘకాలంలో ఆర్థిక క్రమశిక్షణకు ఇవే సోపానాలు. ముఖ్యంగా మన ఆర్థిక లక్ష్యాల సాధనకు పెట్టుబడులే కీలకం. తెలివైన నిర్ణయాలతో చక్కని రాబడులను అందుకోవచ్చు. మరి ఇందుకున్న అవకాశాలు ఏమిటి? ఎలా ముందుకెళ్తే వాటిని సద్వినియోగం చేసుకోవచ్చు?
డైరెక్ట్ ఈక్విటీ
స్టాక్స్‌లో పెట్టే పెట్టుబడులనే డైరెక్ట్ ఈక్విటీ అంటారు. ఏదైనా కంపెనీ షేర్లను మీరు కొన్నైట్టెతే.. అందులో మీకు పాక్షికంగా యాజమాన్య హక్కులు వచ్చినట్టే. ఇక ఈ పెట్టుబడులకు స్టాక్ ఎక్సేంజీలు వేదికలవుతాయి. డీమ్యాట్ ఖాతాల ద్వారా షేర్ల క్రయవిక్రయాలను చేయవచ్చు. అయితే స్టాక్ మార్కెట్ పెట్టుబడులు అనేక అంశాలకు ప్రభావితమై ఉంటాయి. కాబట్టి ఈ ఇన్వెస్ట్మెంట్స్ రిస్కులతో ముడిపడి ఉంటాయి. అందుకే మార్కెట్ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి.
మ్యూచువల్ ఫండ్స్
మ్యూచువల్ ఫండ్స్ సంస్థల గురించి నేటి తరం ఇన్వెస్టర్లకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మన పెట్టుబడులను స్టాక్ మార్కెట్లతోపాటు డెట్, హైబ్రిడ్ ఫండ్స్ తదితర రకరకాల సాధనాల్లో మదుపు చేస్తాయి. దీర్ఘకాలిక మదుపునకు మ్యూచువల్ ఫండ్స్ పెట్టుబడులు లాభదాయకం. సిస్టమ్యాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ల (సిప్)తో ప్రారంభం బాగుంటుంది. అయితే ఇవి కూడా రిస్క్‌తో కూడుకున్నవే. సంబంధిత డాక్యుమెంట్లను క్షుణ్ణంగా చదివి ముందుకెళ్లాలి.
ఫిక్స్డ్ డిపాజిట్లు
బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు ఫిక్స్డ్ డిపాజిట్ల (ఎఫ్డీ)ను ఆఫర్ చేస్తాయి. ఇవి సురక్షిత పెట్టుబడులు అని చెప్పవచ్చు. రిజర్వ్ బ్యాంక్ వడ్డీరేట్ల ఆధారంగా డిపాజిటర్లకు వడ్డీ అదాయం ఉంటుంది. పన్ను మినహాయింపులు లభిస్తాయి. ప్రధానంగా సీనియర్ సిటిజన్లకు అనువైనవి. వీటికి లాకిన్ పీరియడ్ ఉంటుంది.
రికరింగ్ డిపాజిట్లు
రికరింగ్ డిపాజిట్ (ఆర్డీ) కూడా మరో ఫిక్స్డ్ టెన్యూర్ ఇన్వెస్ట్మెంట్. బ్యాంకులు, పోస్టాఫీసుల్లో ఈ పెట్టుబడులకు అవకాశం ఉంటుంది. నెలనెలా చిన్నచిన్న మొత్తాలతో మదుపునకు వీలుంటుంది. పెట్టుబడికి రక్షణ, గ్యారంటీడ్ ఇన్కమ్ వీటి సొంతం.
పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్
ఇదో దీర్ఘకాలిక పన్ను ఆదా పెట్టుబడి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్)కు లాకిన్ పీరియడ్ 15 ఏండ్లు. కేంద్ర ప్రభుత్వం హామీ ఉంటుంది. ప్రతీ మూడు నెలలకోసారి వడ్డీరేట్లను కేంద్రం నిర్ణయించి ప్రకటిస్తుంది.
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్
ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్).. వేతన జీవులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఆదాయ పన్ను (ఐటీ) చట్టంలోని సెక్షన్ 80సీ కింద పన్ను మినహాయింపులు లభిస్తాయి. ఇందులో జమయ్యే నిధులకు అధిక వడ్డీరేటు లభిస్తుంది. కాబట్టి వీటిని ఉపసంహరించుకోకుండా కాపాడుకోవడం కూడా మంచి పెట్టుబడి కిందకే వస్తుంది.
నేషనల్ పెన్షన్ సిస్టమ్
పీపీఎఫ్, ఈపీఎఫ్లతో పోల్చితే నేషనల్ పెన్షన్ సిస్టమ్ (ఎన్పీఎస్)లో పెట్టు బడిదారులు అధిక రాబడులను పొందవచ్చు. పన్ను ప్రోత్సాహకాలుంటాయి. అయితే ఈ పథకాన్ని ఎంచుకొంటే రిటైర్మెంట్దాకా లాకిన్ పీరియడ్ ఉంటుంది. అయినప్పటికీ నిబంధనలకు లోబడి 40 శాతం వరకు నిధులను వెనక్కి తీసుకోవచ్చు. కొంతమంది ప్రభుత్వ ఉద్యోగులకు ఎన్పీఎస్ సబ్స్క్రిప్షన్ తప్పనిసరిగా ఉన్నది.