ChatGPT-Altman | ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారిత చాట్‌జీపీటీ (ChatGPT)తో చాట్‌బోట్ సేవల ప్రారంభంతో టెక్నాలజీ రంగంలో సంచలనాలకు కారణమైన స్టార్టప్ సంస్థ ‘ఓపెన్ ఏఐ (Open AI)` మరోమారు వార్తల్లోకెక్కింది. ఆ సంస్థ సీఈఓగా ఉన్న శామ్ ఆల్టమన్ (Sam altman)ను అర్ధంతరంగా తొలగించేసింది ఓపెన్ ఏఐ బోర్డ్. ఆ తర్వాత కొద్ది సేపటికే ఓపెన్ఏఐ కో-ఫౌండర్, సంస్థ అధ్యక్షుడు గ్రేగ్ బ్రాక్‌మాన్ (Greg Brockman) తన పదవికి రాజీనామా చేశారు. ఆల్టమన్‌ను తొలగించడం వల్లే సంస్థ అధ్యక్షుడిగా గ్రేగ్ తొలగినట్లు తెలుస్తున్నది. చాట్‌జీపీటీకి సంబంధించిన అంశాలేవీ ఆల్టమన్.. బోర్డుతో షేర్ చేసుకోవడం లేదని, దీనికి తోడు తమ నిర్ణయాలను అడ్డుకుంటున్నాడని ఓపెన్ ఏఐ డైరెక్టర్ల బోర్డు ఆరోపిస్తున్నది. కానీ, టెక్నాలజీ నిపుణులు మాత్రం ఆల్టమన్ ఉద్వాసనకు ఇతర కారణాలు ఉన్నాయని చెబుతున్నాయి.
2015లో ఓపెన్ ఏఐ స్థాపించినప్పుడు లాభాపేక్ష లేని సంస్థగా రూపుదిద్దాలని ఫౌండర్ల ఆలోచన. అల్టమన్ తోపాటు సుత్ స్కేవర్, ఎలన్ మస్క్ తదితరులు ఫౌండర్లు. ప్రపంచ మానవాళికి సురక్షిత, బాధ్యతాయుతమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత చాట్ బోట్ సేవలు అందించాలని వీరి సంకల్పం. కానీ 2019లో సీఈఓగా ఆల్టమన్ బాధ్యతలు స్వీకరించాక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయి. దీన్ని పెద్ద కంపెనీగా మార్చాలన్న తన కల సాకారం చేయడానికి టెక్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ నుంచి భారీగా పెట్టుబడులు సేకరించాడు. కంపెనీ ఆశయాలకు భిన్నంగా.. ఓపెన్ ఏఐని లాభదాయక బిజినెస్‌గా మార్చాలన్న అల్టమన్ ఆలోచనలపై సంస్థ బోర్డు సభ్యుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు సమాచారం.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో తలెత్తే దుష్పరిణామాలు, దుష్ప్రభావాలు పరిగణనలోకి తీసుకోకుండా ఆల్టమన్ దూకుడుగా వెళ్లారని సిలికాన్ వ్యాలీ వర్గాల కథనం. చాట్‌జీపీటీ, ఇతర సేవల భద్రతను ఏమాత్రం ఆయన పట్టించుకోలేదని సమాచారం. సొంతంగా జీపీటీలను డిజైన్ చేసి.. కొన్ని ఫ్లగ్ ఇన్లను చాట్‌జీపీటీలో చేర్చింది ఓపెన్ఏఐ. యూజర్లు వెబ్‌సైట్‌కు పోటెత్తడంతో కొన్ని గంటల పాటు చాట్‌జీపీటీ సేవలు నిలిచిపోయాయి. ఫలితంగా ఫ్లగ్ ఇన్స్‌కు సైనప్స్ తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు స్వయంగా ఆల్టమన్ ట్వీట్ చేశారు.
ఇక ఓపెన్ ఏఐ ఫౌండర్లలో ఒకరైన చీఫ్ సైంటిస్ట్ సుత్ స్కేవర్కు, ఆల్టమన్‌కు మధ్య విభేదాలు పెరిగాయి. సంస్థను కమర్షియలైజ్ చేయడంపై వీరికి భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. జూలైలో సూపర్ ఇంటిలిజెంట్ పేరుతో సుత్ స్కేవర్ కొత్త టీం ప్రారంభించారు. నెల క్రితం సుత్ స్కేవర్ బాధ్యతల్లో కంపెనీ కోత విధించడంతో ఆల్టమన్- సుత్స్కేవర్, సుత్స్కేవర్- గ్రేగ్ బ్రాక్ మన్ మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్లు విమర్శలు ఉన్నాయి.