Home Sales | కరోనా మహమ్మారి ప్రభావం తర్వాత ప్రతి ఒక్కరూ సొంతింటి కల సాకారం చేసుకోవడానికి ప్రయత్నించారు. సాధ్యమైనంత వరకూ స్పేసియస్గా ఉండే ఇండ్లను సొంతం చేసుకోవడానికి మొగ్గు చూపారు. క్రమంగా విశాలమైన ఇండ్ల నుంచి లగ్జరీ ఇండ్ల కొనుగోలు వైపు కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా తక్కువ ధరకే లభించే అపార్ట్మెంట్లను కొనుగోలు చేసే వారు తగ్గిపోతున్నారు. 2024లో రూ.50 లక్షల్లోపు ధర గల అపార్ట్మెంట్ల విక్రయాలు 14శాతం తగ్గి 38,626 యూనిట్లకు పరిమితం అయ్యాయి. దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లోనూ ‘చౌక ధర ఇండ్ల వెంచర్లు’తగ్గిపోయాయని ప్రముఖ రియాల్టీ కన్సల్టెంట్ జేఎల్ఎల్ ఇండియా (JLL India) పేర్కొంది.
అదే సమయంలో 2024లో ఏడు ప్రధాన నగరాల పరిధిలో అపార్టుమెంట్ల విక్రయాలు సుస్థిర వృద్ధి సాధించాయి. ముంబై (ముంబై సిటీ, ముంబై సబర్బన్, ఠాణే సిటీ, నెవీ ముంబై), ఢిల్లీ-ఎన్సీఆర్ (ఢిల్లీ, గురుగ్రామ్, నొయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్, సోహ్నా), బెంగళూరు, పుణె, చెన్నై, హైదరాబాద్, కోల్కతా నగరాల పరిధిలో 2023తో పోలిస్తే గతేడాది అపార్ట్మెంట్ల విక్రయాలు 11 శాతం పెరిగాయి. 2024లో రికార్డు స్థాయిలో 3,02,867 (2023లో 2,71,818 అపార్ట్మెంట్లు) అపార్ట్మెంట్ల విక్రయాలు నమోదయ్యాయి. గతేడాది అమ్ముడైన ఇండ్లలో అపార్ట్మెంట్లు, రో హౌసెస్, విల్లాలు ఉన్నాయని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది.
రూ.50 లక్షల్లోపు ధర గల ఇండ్ల విక్రయాలు 45,160 (2023) నుంచి 38,626 యూనిట్లకు పరిమితం అయ్యాయి. రూ.కోటి ధర గల ఇండ్ల విక్రయాలు 2023లో 1,02,685 యూనిట్లు ఉంటే, 2024 లో 1,02,886 యూనిట్లు అమ్ముడయ్యాయి. రూ.కోటి నుంచి రూ.3 కోట్ల లోపు విలువ గల ఇండ్లకు డిమాండ్ పెరిగింది. 2023తో పోలిస్తే 2024లో రూ.కోటి-రూ.3 కోట్ల విలువ గల ఇండ్ల విక్రయాలు 18 శాతం పెరిగి 1,01,451 యూనిట్ల నుంచి 1,19,990 యూనిట్లకు పెరిగాయి.
రూ.3-5 కోట్ల మధ్య విలువ గల ఇండ్ల విక్రయాలు 86 శాతం వృద్ధి చెందాయి. 2023లో 13,881 ఇండ్లు అమ్ముడైతే 2024లో 25,833 యూనిట్ల ఇండ్లు విక్రయించారు. ఇక రూ.5 కోట్ల పై చిలుకు ధర గల లగ్జరీ ఇండ్లకూ 80శాతం గిరాకీ పెరిగింది. 2023లో కేవలం 8,641 యూనిట్ల ఇండ్లు విక్రయిస్తే, గతేడాది 15,532 యూనిట్లకు పెరిగాయి. పట్టణీకరణ, మౌలిక వసతుల అభివృద్ధితో ప్రీమియం ఇండ్లకు గిరాకీ ఎక్కువైంది. ప్రజల ఆదాయం పెరుగుదలతోపాటు జీవన ప్రమాణాల్లో మార్పులు కూడా లగ్జరీ ఇండ్లకు గిరాకీ పెరగడానికి కారణం అని జేఎల్ఎల్ ఇండియా తెలిపింది.