ముంబై/హైదరాబాద్, ఏప్రిల్ 2: ఫార్మాస్యూటికల్ ఫార్ములేషన్ కంపెనీ, తెలుగు రాష్ర్టాలకు చెందిన సాయి పేరంటరల్స్ షేర్లు గురువారం దేశీయ స్టాక్ మార్కెట్లలో నమోదయ్యాయి. తొలిరోజే మదుపరుల నుంచి విశేష స్పందన రాగా.. దాదాపు 4 శాతం లాభాలను అందుకున్నాయి. ఇష్యూ ధర రూ.392 అవగా, బీఎస్ఈలో 3.32 శాతం వృద్ధితో రూ.405 వద్ద కంపెనీ షేర్ లిస్టింగ్ జరిగింది.
ఒకానొక దశలో 6.17 శాతం ఎగిసి రూ.416.20 వద్దకు చేరింది. చివరకు 3.67 శాతం లాభంతో రూ.406.40 దగ్గర ముగిసింది. ఇక ఎన్ఎస్ఈలో రూ.400 వద్ద మొదలైంది. ఇంట్రా-డేలో రూ.416ను తాకింది. ఆఖర్లో 3.32 శాతం లాభపడి రూ.405 వద్ద స్థిరపడింది. కాగా, దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 185.23 పాయింట్లు, నిఫ్టీ 33.70 పాయింట్లు పెరిగాయి.