Meta | ప్రపంచవ్యాప్తంగా ముంచుకొస్తున్న ఆర్థిక మాంద్యం భయాలు.. అన్ని రంగాల కంపెనీలు.. ప్రత్యేకించి టెక్నాలజీ సంస్థలు లాభాలు కాపాడుకునేందుకు పొదుపు చర్యలు చేపడుతున్నాయి. వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. అలా కొలువులు కోల్పోయిన టెక్నాలజీ నిపుణులు.. తమ ఆవేదన, బాధల్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు. కొందరు కారణం చెప్పకుండానే కంపెనీ తొలగించేసిందని చెబితే.. కష్టపడి సేవలందించినందుకు తగ్గ ఫలితం దక్కిందంటూ పోస్టులు పెట్టారు. అందులో ఫేస్ బుక్ పేరెంట్ సంస్థ మెటాలో హ్యుమన్ రీసోర్సెస్ (హెచ్ఆర్) విభాగంలో మేనేజర్‌గా పని చేసిన మాడెలిన్ మచాదో బయట పెట్టిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి.
తాను ఎటువంటి పని చేయకుండానే ఆరు నెలల్లో రూ.1.5 కోట్లు (1.90 లక్షల డాలర్లు) వేతనం అందుకున్నట్లు చెప్పారు. `కంపెనీ ఉద్యోగులు పని చేయాలనుకున్నా.. వారికి కేటాయించడానికేం పని లేదని అనడానికి ఇదే ఉదాహరణ` అని మాడెలిన్ మచాదో వీడియో మెసేజింగ్ యాప్ టిక్‌టాక్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
బ్రిట్నీ లేవి అనే మరో మేటా మాజీ ఉద్యోగి స్పందిస్తూ.. `కంపెనీలో పని చేయడానికి సరైన పని ఉండదు. మెటా వంటి సంస్థల్లో ఎటువంటి ప్లాన్‌లేకుండా ఉద్యోగుల్ని నియమించుకుంటాయి. ఉద్యోగిగా నియమితులైన వారికి సరైన పని కేటాయించరు. చాలా కాలం తాము చేయాల్సిన పని వెతుక్కునేందుకు కష్టపడాల్సి వచ్చింది. కొవిడ్-19 టైంలో టెక్నాలజీకి పెరిగిన ఆదరణతో కంపెనీలు ఎక్కువ మందిని నియమించుకున్నాయి. కానీ, ఇప్పుడు మాంద్యం భయంతో వారిని తొలగిస్తున్నాయి` అని వాపోయారు.
ఇప్పటి వరకు మెటా.. ప్రపంచవ్యాప్తంగా 20 వేల మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. గతేడాది నవంబర్‌లో తొలి విడుత లే-ఆఫ్స్‌లు అమలు చేస్తే, గత నెలలో రెండోసారి లే-ఆఫ్స్ ప్రకటించింది. అలా ఉద్వాసనకు గురైన సిబ్బందికి నాలుగు నెలల వేతనంతోపాటు వారి సర్వీసును బట్టి ఏడాదికి రెండు వారాల వేతనం చెల్లిస్తామని మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ తెలిపారు. అంతే కాదు ఆరు నెలల ఫ్రీ-హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తామన్నారు. మెటాతోపాటు గూగుల్, మైక్రోసాఫ్ట్, ట్విట్టర్, అమెజాన్ వంటి సంస్థలు భారీగా ఉద్యోగులను తొలగించాయి.